ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024లో అమెరికా జట్టు అద్భుత ఆట తీరు కనబరిచిన విషయం తెలిసిందే. మొనాంక్ పటేల్ నేతృత్వంలోని అమెరిన్లు ప్రారంభ మ్యాచ్‌లో కెనడాను ఓడించి విజయంతో టోర్నీని ప్రారంభించారు. అనంతరం బాబర్ ఆజం సారథ్యంలోని పాకిస్థాన్‌ను మట్టికరిపించి రెండో విజయాన్ని నమోదు చేశారు. తద్వారా సూపర్-8కు అర్హత సాధించారు. ఆ విజయాల నుంచి అమెరికన్ ఆటగాళ్లు ఇంకా బయట పడినట్లు లేరు. తాజాగా, ఆ జట్టు పేసర్ అలీ ఖాన్ అగ్రదేశాల జట్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్‌లో జన్మించిన అలీ ఖాన్.. అమెరికా జట్టుకు తన మాతృదేశాన్నే కాకుండా తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఉందని వ్యాఖ్యానించాడు. రాబోవు అలాంటి ఫలితాలను చూస్తారని చెప్పుకొచ్చాడు.
Also Read :- వన్డే ప్రపంచకప్.. దేశానికి 11,637 కోట్ల ఆదాయం
"ఆ మ్యాచ్ లో మేము ఒత్తిడిలో లేము.. వారు(పాకిస్థాన్ ఆటగాళ్లు) ఉన్నారు. అదే మాకు వారిని ఓడించగలమన్న ధైర్యాన్నిచ్చింది. ఫిట్‌నెస్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో మేము వారికంటే మెరుగైన ప్రదర్శన చేశాం.. మా జట్టు ఎప్పటికప్పుడు మెరుగు పడుతోంది. చేతిలో పూర్తి స్థాయి జట్టు ఉంటే, కలిసొచ్చిన రోజున ఏ జట్టునైనా ఓడించగలము.." అని అలీ ఖాన్ అన్నాడు.
సూపర్ ఓవర్‌లో ఓటమి
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా అమెరికా- పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కథే వేరు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 159 పరుగులు చేయగా.. ఛేదనలో అమెరికన్లు సరిగ్గా అన్నే పరుగులు చేశారు. ఆఖరి ఓవర్‌లో అమెరికన్ల విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. బౌలింగ్ వేసిన హ్యారీస్ రౌఫ్ జట్టును నిండా ముంచాడు. అనంతరం సూపర్ ఓవర్‌లో అమెరికా 18 పరుగులు చేయగా.. పాక్ 13 పరుగులకే పరిమితమైంది. దాంతో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
గ్రూప్ దశలో భారతీయుడైన యునైటెడ్ స్టేట్స్ కెప్టెన్ మొనాంక్ పటేల్ భారత్‌కు సవాళ్లు విసిరాడు. కాకపోతే రోహిత్ సేన ఎదుట వారి ఎత్తుగడలు నిలబడలేదు.