హైదరాబాద్: టీఆరెస్ ప్రభుత్వానికి మతపరమైన అజెండా లేదు.. అన్ని మతాల పండుగలకు అందరికి బట్టలు పంపిణీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీరల పంపిణీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా తెలంగాణ ఆడపడుచులు, అక్కలు, చెల్లెల్లకు అడ్వాన్స్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ 9వ తేదీ నుంచి చీరల పంపిణీ చేస్తున్నామని.. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పంపిణీ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇంతటి కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆగలేదని.. అవసరమొస్తే మంత్రులు-ఎమ్మెల్యేల జీతాల్లో కోతలు పెడతామే కానీ.. పేదలకు ఇబ్బందులు పడనివ్వమని స్పష్టం చేశారు. బతుకమ్మ చీరలే కాకుండా ఒక బ్రాండ్ పేరు పెట్టి బయట అమ్మకాలు స్టార్ట్ చేయాలని సూచించారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఉన్న ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో సిరిసిల్ల గోడల పై నేతన్న ధైర్యంగా ఉండు.. ఆత్మహత్యలు వద్దు అనే కొటేషన్ ఉండేవి… చరిత్రలో ఎన్నడూ లేని విదంగా 12వందల కోట్ల రూపాయలు చేనేతకు బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది… ప్రతి ఏటా రాష్ట్ర అడబిడ్డలకు కోటి చీరలు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది… 2017- 220 కోట్లు నుంచి స్టార్ట్ అయి ఈ ఏడాది 317 కోట్లకు పెంచాము… ఈ నాలుగేళ్లలో 4 కోట్ల చీరలు పంపిణీ చేస్తున్నాము… విద్యాశాఖ, గిరిజన శాఖ, కేసీఆర్ కిట్లలో కూడా సిరిసిల్ల చీరలే పంపిణీ చేయబోతున్నామన్నారు. రైతు ఆత్మహత్యలు వేగంగా తగ్గించిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే మొన్న చెప్పింది.. ఢిల్లీలో మాకు అనుకూల ప్రభుత్వం లేదు.. రాజకీయ ప్రత్యర్థులు కేంద్రం అయినా వాళ్ళు ఒప్పుకోక తప్పని పరిస్థితి… పవర్ లూమ్ ను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. సిరిసిల్ల నేతన్నలు తెలంగాణకే పరిమితం కాకుండా తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని వివరించారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గతంలో అడబిడ్డల మొఖంలో రోదన ఉండేది.. తెలంగాణ ఏర్పాటు తరువాత సంతోషం మాత్రమే కనిపిస్తోందన్నారు. గతంలో బతుకమ్మ పండుగలో డబ్బులు ఉన్నోళ్లు.. గొప్పోలు మాత్రమే మంచి చీరలు కట్టుకునే వారు… టీఆరెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఆడబిడ్డ కొత్త బట్టలు చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడుతున్నారని పేర్కొన్నారు. కరోనా ఉన్నా అడబిడ్డలకు అందాల్సిన కానుక కాబట్టి ఆలస్యం కాకుండా ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోందన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వం అందించే చిరు కానుక బతుకమ్మ చీర అన్నారు. ఇంతటి కష్ట కాలంలో కూడా 6 నెలలుగా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు వచ్చాయని.. వేయి కోట్ల రూపాలు చీరల పై ఖర్చు పెట్టారని.. దీనివల్ల కోటి మంది మహిళలు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. 200 కు పైగా డిజైన్స్, వివిధ కలర్స్ తో చీరలను తయారు చేశారని వివరించారు.
టెస్కో ఎండీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. ఈసారి 287 డిజైన్లతో చీరలు ఉత్పత్తి చేశామన్నారు. 80శాతం చీరలు ఇప్పటికే జిల్లా లలకు సరఫరా చేసాం.. మిగతా 20శాతం చీరలు 10రోజుల్లో సరఫరా చేస్తాం.. అక్టోబర్ 9నుంచి చీరల పంపిణీ జరుగుతుంది.. కరోనా మహామ్మారి ఎక్కువ ఉన్న చోట చీరలను డోర్ డిలివరీ చేస్తామన్నారు. 6 గజాలు, 9 గజాల పొడవు ఉన్న చీరలను ఉత్పత్తి చేసాం.. తెలంగాణ లో మరమగ్గాల ఉత్పత్తి సామర్థ్యం తో పాటు నాణ్యత పెరిగిందన్నారు.