అయోధ్యనే కాదు..సీతాపూర్​లోనూ బీజేపీ ఓటమి

అయోధ్యనే కాదు..సీతాపూర్​లోనూ బీజేపీ ఓటమి

న్యూఢిల్లీ : అయోధ్య రామాలయం కొలువై ఉన్న ఫైజాబాద్ తో పాటు సీత నివసించిందని చెబుతున్న సీతాపూర్ నియోజవకర్గంలో బీజేపీ ఓటమి పాలయింది. సీతాపూర్ లోక్ సభ సెగ్మెంట్ బీజేపీకి కంచుకోట. అయినప్పటికీ, ఇక్కడ  కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్ రాథోడ్ విజయం సాధించారు. సీనియర్ నేత రాజేశ్ వర్మను 89,641 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ స్థానంలో బీజేపీని ఓడించడం అందరూ కష్టమని భా  వించారు. కానీ, అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు.

ఇండియా కూటమి పొత్తులో భాగంగా సీతాపూర్ స్థానం ఎస్పీకి దక్కింది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత నరేందర్ వర్మను ఇక్కడి నుంచి బరిలో నిలపాలని భావించింది. ఆయన మాత్రం ఇక్కడ గెలుపొందడం కష్టమని భావించి టికెట్ ను నిరాకరించారు. దీంతో ఎస్పీ ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కు వదులుకుంది. మాజీ మంత్రి నకుల్ దూబేకు ఆ పార్టీ  టికెట్ ను ఇవ్వాలనుకుంది. కానీ, నాలుగు రోజుల తర్వాత ఆయన కూడా పోటీ చేయడానికి నిరాకరించారు.

అభ్యర్థులు దొరక్కపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ తేలీ కమ్యూనిటీకి చెందిన రాజేశ్ రాథోడ్ కు టికెట్ ను కేటాయించింది. ఆయన నామినేషన్ తో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఓబీసీలు, దళితులు కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆయనను విజయం వరించింది. కాగా, రాముడి భార్య సీత పేరు మీదుగా సీతాపూర్ కు ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది.