- బాబాపూర్‌లో ఎనిమిది మంది.. కేతినిలో 46 మంది స్టూడెంట్స్ హాజరు
- పిల్లలను రప్పించే ప్రయత్నం చేయని టీచర్లు, సిబ్బంది
- పట్టించుకోని ఐటీడీఏ ఆఫీసర్లు
కాగజ్ నగర్,వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదువులు సాగడం లేదు. దసరా సెలవులు ముగిసి నాలుగు రోజులు కావాస్తున్నా.. ఇప్పటి వరకు పట్టుమని పది మంది స్టూడెంట్లు స్కూళ్లకు రావడంలేదు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని రెండు స్కూళ్లలో గురువారం క్లాస్ రూమ్‌లకు అసలు తాళాలే తీయలేదు. స్టోర్ రూమ్‌లో మాత్రం కొన్ని కూరగాయలు మాత్రం ఉన్నాయి. పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటూ కనిపించారు. మూడు రోజులుగా స్టూడెంట్స్ హాజరు రిజిస్టర్ ఖాళీగా ఉంది. టీచర్లు, సీఆర్టీలు సైతం అటెండెన్స్ రిజిస్టర్లో మూడు రోజులుగా సంతకాలు పెట్టలేదు. బాబాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో మొత్తం 274 స్టూడెంట్స్ కు గాను గురువారం కేవలం ఎనిమిది మంది మాత్రమే హాజరయ్యారు.
క్లాస్ రూమ్‌లకు తాళాలు ఉండడంతో వారంతా బయటే కనిపించారు. హెచ్ఎం తిరుపతి పీవో మీటింగ్ కు వెళ్లడంతో వార్డెన్ స్టోర్ రూమ్‌కు తాళం వేసి మధ్యాహ్నమే వెళ్లిపోయారు. కేతిని బాలుర ఆశ్రమ పాఠశాలలో 212 మంది స్టూడెంట్స్కు గాను కేవలం 46 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక్కడ వంట మనిషి రావుజీ డ్యూటీని మరో వ్యక్తి శ్రీను చేస్తూ కనిపించాడు. ఇక్కడా మూడు రోజులుగా పిల్లల అటెండెన్స్ ఖాళీగానే ఉండడం విశేషం. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతోనే పేద పిల్లలకు చదువు అందడంలేదని,ఐటీడీఏ ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు.