కేసు మాకు అప్పగిస్తే..సంజయ్ రాయ్​కు మరణశిక్ష పడేలా చూసేవాళ్లం: మమతా బెనర్జీ

 కేసు మాకు అప్పగిస్తే..సంజయ్ రాయ్​కు మరణశిక్ష పడేలా చూసేవాళ్లం: మమతా బెనర్జీ
  • సంజయ్ రాయ్​కు జీవితఖైదు
  •     చనిపోయే వరకు జైలులోనే..
  •     ఆర్జీ కర్ రేప్, మర్డర్​ కేసులో సీల్దా కోర్టు తీర్పు
  •     జడ్జిమెంట్ పై డాక్టర్  తల్లిదండ్రుల అసంతృప్తి

కోల్ కతా : ఆర్జీ కర్  మెడికల్  కాలేజీ అండ్  హాస్పిటల్​లో 34 ఏండ్ల డాక్టర్ పై జరిగిన రేప్, మర్డర్  కేసులో దోషి సంజయ్  రాయ్​కు కోల్ కతాలోని సీల్దా కోర్టు జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. ఈ కేసు అత్యంత అరుదైన కేసుల్లో ఒకటి కాదని, కాబట్టి.. మరణశిక్ష విధించే జాబితాలోకి రాదని కోర్టు పేర్కొంది. మరణించే వరకూ రాయ్ కు జైలుశిక్ష విధిస్తూ జడ్జి జస్టిస్ అనిర్బన్  దాస్  తీర్పు చెప్పారు. డాక్టర్ తల్లిదండ్రులకు రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. అయితే.. తమకు పరిహారం వద్దని, న్యాయం మాత్రమే కావాలని పేరెంట్స్  చేతులు జోడించి జడ్జి ముందు వేడుకున్నారు. సీబీఐ దర్యాప్తు సరిగా జరగలేదని, మిగతా వారిని వదిలేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ దర్యాప్తు తీరుపై తాము సంతృప్తిగా లేమని తెలిపారు. ‘‘నేరంలో రాయ్  ఒక్కడే లేడు. మిగతా వారి హస్తం కూడా ఉంది. 

వారిని పట్టుకోవడంలో సీబీఐ అధికారులు ఫైయిల్  అయ్యారు. మిగతా దోషులకు ఈ సమాజంలో బతికే హక్కు లేదు. భవిష్యత్తులో మహిళలపై అలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే దోషులకు మరణశిక్ష వేయాల్సిందే” అని డాక్టర్  తల్లిదండ్రులు డిమాండ్  చేశారు. అయితే.. చట్టప్రకారంగానే పరిహారం చెల్లింపుపై తాను ఆదేశించానని, ఇష్టం ఉంటే తీసుకోవచ్చని, బలవంతం లేదని జడ్జి తెలిపారు. డాక్టర్ కు జరిగిన ఘోరానికి రూ.17 లక్షల  మొత్తాన్ని పరిహారంగా చూడరాదని పేర్కొన్నారు. సోమవారం కోర్టుహాలులో దోషి సంజయ్  రాయ్  వాదనలను జడ్జి మరోసారి విన్నారు. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను ఇరికించారు. సాక్ష్యాధారాలను నాశనం చేశారు. ఒకవేళ డాక్టర్ పై నేను అత్యాచారానికి పాల్పడి ఉంటే, నా రుద్రాక్షమాల తెగి ఉండేది. నన్ను ఇరికించారో లేదో మీరే (జడ్జి) డిసైడ్  చేయండి” అని రాయ్  అన్నాడు. ఈ కేసులో న్యాయంగా తీర్పు చెప్పాల్సిన బాధ్యత తనది అని, తన ముందు ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగానే తీర్పు చెప్పానని జడ్జి రిప్లై ఇచ్చారు.

తీర్పుపై బెంగాల్​ సీఎం మమత అసంతృప్తి

సంజయ్  రాయ్ కు జీవితఖైదు విధిస్తూ సీల్దా కోర్టు విధించిన తీర్పుపై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐకి బదిలీ చేశారని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఈ కేసును రాష్ట్ర పోలీసులే దర్యాప్తు చేసి ఉంటే, దోషికి మరణశిక్ష పడేలా చూసేవాళ్లమని చెప్పారు.