- మిగతా గ్రూపుల్లో అడ్మిషన్లు ఫుల్ అయినా సౌకర్యాల్లేవ్
- కొత్తగా ఏర్పడిన కాలేజీలో అరకొర వసతులు
- రెండేండ్లుగా చీకటి గదుల్లోనే క్లాసులు
- గెస్ట్ ఫ్యాకల్టీతో నెట్టుకొస్తున్న వైనం
రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా ప్రవేశపెట్టిన టెక్స్‌టైల్స్ కోర్సులో ఒక్క అడ్మిషన్ కాలేదు. దీనికి కాలేజీలో అరకొర వసతులే కారణమన్న ప్రచారం జరుగుతోంది. మిగతా బ్రాంచీల్లో(గ్రూపులు) రెండేండ్లుగా విద్యార్థులు చేరగా అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నారు. 2021 లో మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్లలో ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటుకాగా అప్పటి నుంచి తాత్కాలికంగా సిరిసిల్ల పట్టణానికి సమీపంలోని అగ్రహారం డిగ్రీ కాలేజీలో క్లాసులు నిర్వహిస్తున్నారు.
ఈ కాలేజీ పాతది కావడంతో ఆ రూముల్లోనే విద్యార్థులు చదువుకుంటున్నారు. మరోవైపు కాలేజీలో భారీగా అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యార్థులు సరైన సౌలతుల్లేక అవస్థలు పడుతున్నారు. కాలేజీలో ఒక్క ప్రిన్సిపాల్తప్ప టీచింగ్ ఫ్యాకల్టీ మొత్తం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.
అడ్మిషన్లు ఫుల్
సిరిసిల్ల ఇంజినీరింగ్ కాలేజీలో చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. 2021-–22 విద్యా సంవత్సరంలో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, టెక్స్ టైల్ విభాగంలో 109 మంది విద్యార్థులు చేరారు. 2022-–23 లో 204 మంది విద్యార్థులు చేరగా సీఎస్ఈ 66, ఈసీఈ66, ఈఈఈ32, సివిల్20, మెకానికల్ ఇద్దరికి సీట్లు రాగా 169 మంది విద్యార్థులు సీటును ఖరారు చేసుకున్నారు. కాలేజీలో ప్రస్తుతం 563 మంది విద్యార్థులు ఉన్నారు.
పార్టేషన్ రూం...తాత్కాలిక ల్యాబ్ లు
అగ్రహారం డిగ్రీ కాలేజ్‌లో టెంపరరీగా ఇంజినీరింగ్‌కాలేజీ ఏర్పాటు చేసి పార్టేషన్ రూమ్‌లు, తాత్కాలిక ల్యాబ్ ఏర్పాటు చేశారు. మెయిన్ గేట్ పక్కన మరో గేట్ ఏర్పాటు చేసి లోపల 5 రూములను వేరుచేసి ఇంజినీరింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. క్లాస్‌రూముల్లో సరైన వసతుల్లేక కరెంట్‌పోతే చీకట్లోనే క్లాసులు వినాల్సిన దుస్థితి. ఇంజినీరింగ్‌విద్యార్థులకు కచ్చితంగా ల్యాబ్‌లు నిర్వహించాల్సి ఉండగా ఇంకా ఇన్ఫ్రాక్చర్ రావాల్సి ఉంది.
టెక్స్ టైల్ కోర్సులో జీరో అడ్మిషన్లు
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు. దీంతో ఇక్కడ టెక్స్ టైల్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సిరిసిల్ల ఇంజినీరింగ్ కాలేజీలో ప్రత్యేకంగా టెక్స్ టైల్ కోర్సును ప్రవేశపెట్టారు. తొలిఏడాది ఈ కోర్సులో కేవలం 8 మంది విద్యార్థులు చేరగా.. ఈసెట్ద్వారా సెకండియర్‌కు 22 మంది ఉన్నారు. గతేడాది టెక్స్ టైల్ కోర్సులో 4గురు చేరగా సెకండ్విడత కౌన్సెలింగ్ లో మరో కోర్సును ఎంచుకున్నారు. ఈ ఏడాది ఒక్కరూ చేరకపోడం గమనార్హం.
ఇప్పటిదాకా స్థలం కేటాయించలేదు
కాలేజీ ప్రస్తుతం టెంపరరీగా కొనసాగుతుండగా సొంత బిల్డింగ్ నిర్మాణానికి ఇప్పటివరకు స్థల సేకరణ చేయలేదు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు బైపాస్‌లో మెడికల్ కాలేజీ సమీపంలో, తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీ కోసం రెండేళ్ల కింద స్థల పరిశీలన చేశారు. కానీ ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు.
గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నరు..
సిరిసిల్ల ఇంజినీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్మినహా ఒక్క రెగ్యులర్పోస్టూ లేదు. కాలేజీలో విద్యార్థులు చేరుతున్నా వారికి చదువు చెప్పే టీచింగ్ఫ్యాకల్టీ ఉండడం లేదు. రెండేండ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలోనైనా ఫ్యాకల్టీని భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గెస్ట్ ఫ్యాకల్టీతోనే క్లాసులు రన్అవుతున్నాయి. హాస్టల్ వసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. అగ్రహారం గ్రామంలో ఓ ప్రైవేటు బిల్డింగ్ అద్దెకు తీసుకుని ప్రస్తుతానికి హాస్టల్ నిర్వహిస్తున్నారు.