![సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని మేమంటే.. ఒవైసీ పడమర అంటారు](https://static.v6velugu.com/uploads/2019/12/owasi-2.jpg)
- మేం ఏది మాట్లాడినా అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకిస్తారు: అమిత్ షా
తమ ప్రభుత్వం ఏ పని చేసినా దాన్ని వ్యతిరేకించడమే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పనిగా పెట్టుకున్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తాము సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పినా దాన్ని కూడా ఆయన కాదంటారని ఎద్దేవా చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అమిత్ షా.. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్సీఆర్)లకు ఏ సంబంధం లేదని వివరించారు. ఎన్పీఆర్ అనేది ఎన్సీఆర్‌కు తొలి మెట్లు అని ఒవైసీ చేసిన కామెంట్‌ను అమిత్ షా ఖండించారు.
ఒవైసీజీ వ్యాఖ్యలు తనకు ఏం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. తాము సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నా.. ఆయన కాదు పడమర అని అంటారని సెటైర్లు వేశారు. అయితే ఎన్పీఆర్ పూర్తిగా భిన్నమైనదని, ఎన్సీఆర్‌కు సంబంధం లేదని ఒవైసీకి తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. అలాగే ఎన్పీఆర్‌ని కూడా తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సీఎంలు చెప్పడంపైనా ఆయన స్పందించారు. రాజకీయాల కోసం పేదలకు ప్రయోజనాలు అందకుండా అడ్డుకోవద్దని కోరారు అమిత్ షా. కాగా, జాతీయ జనాభా రిజిస్టర్ అప్‌డేట్ చేసేందుకు రూ.3941 కోట్లు, జన గణన కోసం రూ.8754 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నేడు ఆమోదం తెలిపింది.