మన దేశంలో రిచెస్ట్ క్రికెటర్ ఎవరా..? అన్న ప్రశ్న అందరి మదిలో మెదిలేదే. ఈ ప్రశ్న వినగానే అందరూ సచిన్, కోహ్లీ, ధోనీ అంటూ భారత క్రికెటర్ల పేరు చెప్పేస్తారు. అందుకు కారణం లేకపోలేదు. తమ పేరునే ఒక బ్రాండ్‌గా మలుచుకున్న.. ఈ క్రికెటర్లు భారీ సంపదనే పోగేశారు. కానీ రిచెస్ట్ క్రికెటర్ అని చెప్పేంత కాదు. వీరి వద్ద ఉన్న సంపద వందల కోట్లలో ఉంటే.. రిచెస్ట్ క్రికెటర్‌గా చెప్పుకుంటున్న ఓ భారత మాజీ క్రికెటర్ వద్ద వేల కోట్ల సంపద ఉంది. ఎవరా క్రికెటర్..? అతని కుటుంబ నేపథ్యం ఏంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
రాజ కుటుంబం
రిచెస్ట్ క్రికెటర్‌గా చెప్పుకుంటున్న ఆ ఆటగాడు స్టార్ క్రికెటర్ కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. అతని పేరు.. 'సమర్‌జిత్‌సిన్హ్ రంజిత్‌సిన్హ్ గైక్వాడ్'. 1967 ఏప్రిల్ 25న రాజ కుటుంబంలో జన్మించిన ఆయన.. ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. బరోడా జట్టు తరుపున దేశవాళీ క్రికెట్ ఆడారు. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్ల పైమాటే.
ఈయనకు ఇంత ఆస్తి ఉండటానికి కారణం అతని కుటుంబ నేపథ్యమే. సమర్‌జిత్ సిన్హ్ రాజవంశానికి చెందినవారు. ఒకప్పటి వడోదర రాజ దంపతులు రంజిత్ సిన్హ్ ప్రతాప్ సిన్హ్ గైక్వాడ్, శుభంగినిరాజేలకు ఏకైక కుమారుడు. 2012 మేలో తన తండ్రి మరణించిన తర్వాత ఆయనకు పట్టాభిషేకం జరిగింది. మహారాజా హోదాను పొందారు. దాంతో వారసత్వంగా రూ.20 వేల కోట్ల సంపద సంక్రమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్, మోతి బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం యజమాని కూడా ఈయనే.
సమర్‌జిత్ సిన్హ్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. ఈయన బరోడా తరఫున 1987-89 మధ్య రంజీ ట్రోఫీలో 6 మ్యాచ్‌లు ఆడి 119 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 65. బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగానూ పనిచేశారు.
ఇక భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ సంపద ఇటీవలే రూ.1,000 కోట్లు దాటగా.. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ నికర సంపద రూ.1250 కోట్లుగా ఉంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ నికర సంపద రూ.1040 కోట్లుగా ఉంది.