సమాధులంటే ఇండియన్లకు చాలా గౌరవం. ఈజిప్ట్‌లో మాత్రం పాతకాలపు సమాధులంటే ఖజానాల కింద లెక్క. రెండో ప్రపంచ యుద్ధం వరకు వాటిని దొంగలు దోచుకునేవారు. ఆ తర్వాతనే వాటిని చారిత్రక కోణంలో రక్షించుకునే ప్రయత్నాలు చురుగ్గా సాగాయి. నిన్న మొన్నటి వరకు ఎవరికీ పట్టని ఓ ఈజిప్టు రాజు సమాధి ఇప్పుడు ఓ టూరిజం ట్రెజర్‌గా మారింది. సమాధిలో దొరికిన వస్తువులను చూడటానికి జనం ఎగబడుతున్నారు. బాగా డబ్బులున్న వాళ్లయితే వేలం పాటల్లో కొనుక్కుని ఇళ్లకు తీసుకెళుతున్నారు.
ఈజిప్ట్‌లో నైలు నది తీరాన అదో సమాధి. కొన్ని వేల ఏళ్ల కిందటిది. దాదాపుగా 3,400 ఏళ్లు గడిచినా రవ్వంత కూడా చెక్కు చెదరలేదు. ఈజిప్ట్ హిస్టరీని స్టడీ చేసిన బ్రిటిష్ ఆర్కియాలజిస్టు హోవర్డ్ కార్టర్‌కు ఈ సమాధిపై కుతూహలం పెరిగింది. సమాధి తలుపులు తెరిచాడు. జాగ్రత్తగా లోపలకు ఎంటరయ్యాడు. లోపల సీన్ చూస్తే కార్టర్‌కు కళ్లు తిరిగాయి. బోలెడన్ని ఆభరణాలు. రకరకాల డిజైన్లలో నగలు. అన్నీ బంగారంతో చేసినవే. జ్యుయెలరీ ఒకటే కాదు, లోపల 5,000కు పైగా అద్భుతమైన కళా ఖండాలు కూడా ఉన్నాయి. కార్టర్ వెంట ఉన్న ఫొటోగ్రాఫర్ వెంటనే అన్నిటినీ క్లిక్ మనిపించాడు. ఈ సమాధి ఈజిప్ట్‌లో నైలు నది తీరాన లుక్సార్ ప్రాంతాన ఉంది. కార్టర్ వెదుకులాట సాగింది 1922లో. ఆ సమాధి క్రీస్తు పూర్వం 1539-–1075 మధ్య కాలానికి చెందిన ఫారో రాజవంశంలోని కింగ్ టూటన్ఖామున్ది. ఆయన్నే ‘కింగ్ టూట్’ అని కూడా పిలుస్తారు. చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. కార్టర్ అన్వేషణ ఫలించడంతో అప్పటివరకు ఎవరికీ తెలియని కింగ్ టూట్ ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ‘అసలు ఎవరీ టూట్? ఆయన సమాధి స్పెషాలిటీ ఏంటి?’ అంటూ ఆర్కియాలజిస్టులు పరిశోధనలు చేయడం మొదలెట్టారు.
సహజంగా ఈజిప్టు రాజుల సమాధులు ధ్వంసమై ఉంటాయి. ఇష్టమొచ్చినట్లుగా దొంగలు తవ్వేసి దోచుకుంటారు. సమాధుల్లో దోచుకోవడానికి ఏముంటాయన్న సందేహం రావచ్చు. ఈజిప్ట్‌లో రాజులు చనిపోయినప్పుడు చాలా విశాలమైన సమాధులు కట్టేవారు. వాటిలో ఆనవాయితీగా నగలు, ఇతర ఖరీదైన వస్తువులు, రాజుకిష్టమైన కళాఖండాలు వగైరాలు ఆయన సమాధిలో కుటుంబ సభ్యులు పెడుతుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లోనైతే బానిసల్నికూడా సమాధిలోనే వదిలేసేవారు. ఏనాటికైనా రాజు మరలా ప్రాణం పోసుకుంటాడన్న నమ్మకం బలంగా ఉండేది. ఆనాటి ఈజిప్టు రాచరికపు కల్చర్‌లో ఇదో భాగం. ఆ తరువాత ఏళ్లు గడిచేకొద్దీ దొంగల కన్ను పడేది. నగలు, ఖరీదైన వస్తువుల కోసం అదే పనిగా రాజుల సమాధులు తవ్వేసేవారు. లోపల ఉన్న విలువైన వస్తువులు తీసుకుని ఉడాయించేవాళ్లు. అయితే, హోవర్డ్ కార్టర్ ఫోకస్ పెట్టేంతవరకు కింగ్ టూట్ సమాధిని ఎవరూ టచ్ చేయలేదు. ఎందుకంటే, అనాటి రాజుల సమాధిలా ఎవరికీ కనిపించలేదు. రాజుల సమాధుల కోసం కేటాయించిన లోయలో చాలా భారీ హంగామాతో టోంబ్స్ కట్టేవారు. అలాంటిది కింగ్ టూట్ సమాధి చాలా చిన్న సమాధి. వేల ఏళ్లపాటు దాని జోలికి వెళ్లకపోయేసరికి శిథిలాల మధ్యలో చిక్కుపడిపోయింది.
ఈజిప్షయన్ల చరిత్రపై స్టడీ చేసిన హోవర్డ్ కార్టర్ (1874–1939) అతనిపై ఆసక్తి పెంచుకున్నారు. ఫారో చక్రవర్తుల చరిత్రలో 18వ తరానికి చెందిన కింగ్ టూటన్ఖామున్ గురించి తెలుసుకుని, అతని సమాధికోసం ప్రయత్నించాడు. లార్డ్ కార్నర్వాన్ అనే ధనికుడు స్పాన్సర్షిప్ చేయడంతో ఆరేళ్లపాటు అన్వేషించాడు. చివరకు 1922 నవంబర్ 26న కింగ్ టూట్ సమాధి దొరికింది. కింగ్స్ వాలీలో దొరికిన టోంబ్లన్నింటికంటే ఇదే చాలా గొప్పదిగా చరిత్రకెక్కింది.
కింగ్ టూట్ సమాధిలో దొరికిన అద్భుత కళాఖండాల్లో కొన్నిటితో 1960ల్లో ఒక ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అప్పటికి ఈజిప్టులో అనేక ఆర్కియాలజికల్ సైట్లు సరైన ఆలనా పాలనా లేక మట్టిదిబ్బల మధ్య పడిఉన్నాయి. వీటిని డెవలప్ చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. దీంతో కింగ్ టూట్ సమాధిలో దొరికిన కళాఖండాలతో బయటి దేశాల్లో ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ఈజిప్టు పర్మిషన్ ఇచ్చింది. అలా ఈ ఆర్ట్ పీసెస్ ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ జర్నీ మొదలైంది.
అమెరికా, కెనడా, రష్యా, జర్మనీ, జపాన్ సహా అనేక దేశాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో దేశంలో కొన్ని రోజుల పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేవాళ్లు. ఈ ఎగ్జిబిషన్ చూడటానికి వందల సంఖ్యలో జనం వచ్చేవారు. కిందటేడాది కాలిఫోర్నియా సైన్స్ సెంటర్ (అమెరికా)లో ‘ ఫ్రెంచ్ ఆర్ట్ షో’ పేరుతో జరిగిన ఈ ఎగ్జిబిషన్ సూపర్ హిట్ అయింది. ఆ తరువాత పారిస్ సిటీలో నిర్వహిస్తే, అక్కడ కూడా జనం ఎగబడ్డారు. దాదాపు 15 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
లేటెస్ట్గా లండన్‌లో ఎగ్జిబిషన్
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 సిటీల్లో ఈ టూరింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్పిరేషన్తోనే ట్రావెలింగ్ ఎగ్జిబిషన్‌ని ప్రపంచంలోని 10 టాప్ సిటీల్లో ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నవంబర్‌లో లండన్‌లోని సాచి గ్యాలరీలో ఎగ్జిబిషన్ నడిపారు. కింగ్ టూట్ సమాధి నుంచి తీసిన అద్భుత కళాఖండాలను చూడటానికి జనం రావడం మొదలెట్టారు. కింగ్ టూట్ మొహాన్ని పోలిన విగ్రహం ఈ ఎగ్జిబిషన్లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆయన వాడినట్లు భావిస్తున్న ఆయుధాలు, ఆభరణాలు… వేటిని చూసినా కళ్లు తిప్పుకోలేకపోయారు జనం. వచ్చే ఏడాది గిజా ప్రాంతంలో ‘గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం’ పేరుతో ఏర్పాటుకి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఈజిప్టు అనగానే పిరమిడ్లు
ఈజిప్టు పేరు వినగానే ఎవరికైనా వెంటనే పిరమిడ్లు గుర్తొస్తాయి. పిరమిడ్ అంటే సమాధి. కొన్ని వేల ఏళ్ల కిందట నేటికీ అంతు చిక్కని టెక్నాలజీతో నిర్మించిన కట్టడాలే ఈ పిరమిడ్లు. ఈజిప్టు రాజవంశానికి చెందినవారు చనిపోయినప్పుడు వారికోసం పిరమిడ్లు నిర్మించేవారు. మొదట్లో రాజవంశీకుల సమాధులను మాత్రమే నిర్మించేవారు. ఆ తరువాత రోజుల్లో రాజులకు దగ్గరైన మంత్రులు, సేనాపతుల పిరమిడ్లు కూడా నిర్మించడం మొదలెట్టారు. ఈజిప్టు నాగరికతకు ఈ సమాధులు ప్రతిబింబంగా నిలిచిపోయాయి.
ఎవరీ కింగ్ టూట్?
కింగ్ టూట్గా పాపులరైన టూటన్ఖామున్ ఫారో వంశానికి చెందిన ఈజిప్టు రాజు. క్రీస్తు పూర్వం 1334 కాలం నాటి వాడని చరిత్రకారులు చెబుతారు. చాలా చిన్న వయసులో… 19 ఏళ్లకే చనిపోయాడన్నది కథనం. అయితే అంత తక్కువ వయసులో ఎలా చనిపోయాడన్నది ఎవరూ చెప్పలేదు. కింగ్ టూట్ చావు ఇప్పటికీ ఓ మిస్టరీనే. కింగ్ టూట్ హత్యకు గురయ్యాడని చాలామందికి అనుమానం. దీనికి కూడా కచ్చితమైన ఆధారాల్లేవు. కింగ్ టూట్కు మతానికి సంబంధించి కొన్ని కచ్చితమైన అభిప్రాయాలుండేవట. అప్పటి రోజుల్లో ఆయన ఓ రెబెల్ అంటారు హిస్టారియన్లు. అతని సమాధిని తవ్వి తీసిన తర్వాత హోవర్డ్ కార్టర్ దోమకాటువల్ల అనారోగ్యం పాలయ్యాడు. చివరకు 1939లో కన్నుమూశాడు. కార్టర్ అనారోగ్యానికి, చావుకు కింగ్ టూట్ ప్రేతాత్మ కారణమని చాలాకాలం ప్రచారంలో ఉండేది. చిన్న వయసులోనే చనిపోయిన కింగ్ టూట్కి అద్భుత శక్తులున్నాయని ఈజిప్షియన్లు నమ్ముతుంటారు.
టూట్ వస్తువులకు టాప్ రేట్
కింగ్ టూట్కి సంబంధించిన ఆభరణాలు, నగల్లో కొన్నింటిని గతంలో వేలం వేస్తే చాలా రేటు పలికింది. కింగ్ టూట్ బ్రౌన్ కలర్ విగ్రహం దాదాపు 60 లక్షల డాలర్లకు అమ్ముడైంది. ఇదొక్కటే కాదు… ఆయన వాడినట్లు భావిస్తున్న మరికొన్ని వస్తువులను కూడా ఆర్ట్ పీసెస్ కలెక్ట్ చేసేవాళ్లు పెద్ద అమౌంట్‌కు వేలంలో సొంతం చేసుకున్నారు.
వేల ఏళ్ల నాటి పిరమిడ్లు ప్రస్తుతం ఈజిప్టుకు ప్రధాన రాబడి వనరుగా మారాయి. పిరమిడ్లు చూడటానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు ఈజిప్టుకు క్యూ కడుతుంటారు. 2011 వరకు టూరిస్టుల తాకిడి బాగా ఉండేది. 2011 తర్వాత ఈజిప్టులో పొలిటికల్ మార్పులవల్ల టూరిజం బాగా దెబ్బతింది. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టూరిస్టులను మునుపటిలా ఆకట్టుకోవడానికి పిరమిడ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.