న్యూఢిల్లీ: మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఎంపీ హేమ మాలిని స్పందించారు. ‘‘ఇటీవలే మేము కుంభమేళాలో పాల్గొన్నాం. యూపీ సీఎం యోగి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అంతపెద్ద మేళాను సర్కారు చాలా బాగా నిర్వహిస్తోంది. అయితే, మౌని అమావాస్య రోజు తొక్కిసలాట జరగడం బాధాకరం, దురదృష్టకరం. అదేమంత పెద్ద సంఘటన కాదు. ఎందుకంటే, కొన్నికోట్ల మంది పాల్గొనే మేళాలో కొన్నిసార్లు అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి” అని హేమమాలిని వ్యాఖ్యానించారు.
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాలో బుధవారం తెల్లవారుజామున(జనవరి 29, 2025) తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. రష్ కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. గాయపడిన వారిని మేళా నిర్వాహకులు అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు.
అఖాడా మార్గ్‌లో త్రివేణి సంగమానికి కిలో మీటర్ దూరంలో ఉన్న సెక్టార్ 2లో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా గుట్టలకొద్దీ బ్యాగులు.. చెప్పులు.. బట్టలు.. దుప్పట్లు దర్శనమిచ్చాయి. బుధవారం మౌని అమావాస్య కావడంతో పుణ్య స్నానమాచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. మెయిన్ ఘాట్లో అఖాడాల పుణ్య స్నానాల కోసమే ఏర్పాట్లు చేయగా.. కోట్లాది మంది భక్తులు అటువైపు వెళ్లినట్లు తెలుస్తున్నది.
అసలు ఆరోజు ఏం జరిగింది?
మౌని అమావాస్య రోజు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయనేది భక్తుల విశ్వాసం. ఈ సమయంలో పుణ్యస్నానమాచరిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందనే నమ్మకంతో బుధవారం(జనవరి 29, 2025) మహా కుంభమేళాకు కోట్లాది భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నెత్తిన బ్యాగులు.. చేతుల్లో నీళ్ల బాటిళ్లతో త్రివేణి సంగమం మెయిన్ ఘాట్ వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు కదిలారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో కొందరు భక్తులు కర్రలతో ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించారు.
అవి కాస్తా విరిగిపోయాయి. భక్తులంతా ఒకరినొకరు తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది. వెంట తెచ్చుకున్న బ్యాగులు, దుప్పట్లు, లగేజీతో పరిగెత్తలేక కొందరు కింద పడిపోయారు. అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో హాస్పిటల్‌కు తరలించారు. రద్దీ కారణంగా ఒక దశలో అంబులెన్స్‌కు కూడా దారి లేని పరిస్థితి ఏర్పడింది.