ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా నరేంద్ర మోడీ సునామీ కనిపించినా పంజాబ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది. మొత్తం 13 లోక్‌సభ సీట్లలో ఎనిమిదింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. బీజేపీ–శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) కూటమికి కేవలం నాలుగు సీట్లే దక్కాయి. చాలా మంది ఈ విజయాన్ని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఖాతాలో వేయడానికి ప్రయత్నించారు. ఇదొక్కటే కారణం కాదంటున్నారు రాజకీయ పండితులు. పార్టీలకతీతంగా సిక్కులందరూ బీజేపీ–ఎస్‌ఏడి కూటమికి వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యారన్నది వారి అభిప్రాయం.
పంజాబ్ జనాభాలో మెజారిటీ వర్గం సిక్కులే. తర్వాతి స్థానంలో హిందువులు ఉంటారు. చాలా కాలం పాటు బీజేపీ – శిరోమణి అకాలీదళ్ కూటమికి రాష్ట్రంలోని సిక్కులు, హిందువులు అండగా ఉన్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ నాయకత్వంలోని శిరోమణి అకాలీదళ్ సహజంగా సిక్కులకు సంబంధించిన మతపరమైన సంస్థలను కంట్రోల్ చేస్తుంది. ఇందులో రాజకీయ పార్టీల తేడాలుండవు. కేవలం సిక్కుల మతపరమైన అంశాలనే ఈ సంస్థ చూస్తుంది. అయితే శిరోమణి అకాలీదళ్ పై కొంతకాలంగా సామాన్య సిక్కు ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.
సిక్కుల మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసింది 2015 అక్టోబర్ నాటి బార్గారి సంఘటన. ఈ సంఘటనలో సిక్కుల పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనతో సిక్కుల ఫీలింగ్స్ దెబ్బతిన్నట్లు వార్తలొచ్చాయి. ఈ సంఘటన పై దర్యాప్తు జరపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంజిత్ సింగ్ కమిషన్ కిందటేడాది విడుదల చేసిన రిపోర్ట్ లో అప్పటి ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. సంఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి హోదాలో ప్రకాశ్ సింగ్ బాదల్ ఫెయిల్ అయ్యారని కామెంట్ చేసింది. సిక్కు గ్రంథాల అపవిత్రం సంఘటన జరిగాక పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. పోలీసు కాల్పుల్లో ఇద్దరు సిక్కు యువకులు చనిపోయారు. ఇంత జరిగినా ప్రకాశ్ సింగ్ బాదల్ ఏమాత్రం రెస్పాండ్ కాలేదని రంజిత్ సింగ్ కమిషన్ స్పష్టం చేసింది. దీంతో శిరోమణి అకాలీదళ్ ఒక్కసారిగా కాంట్రవర్శీలకు కేంద్రంగా మారింది. బీజేపీ, ఆరెస్సెస్ లీడర్లు చెప్పినట్లే అకాలీదళ్ నాయకులు నడుచుకుంటున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.ఈ నేపథ్యంలో మతపరమైన హక్కుల కోసం జరుపుతున్న పోరాటంలో భాగంగా బీజేపీ – శిరోమణి అకాలీదళ్ కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని మెజారిటీ సిక్కులు ఓటు వేసినట్లు పొలిటికల్ ఎనలిస్టుల విశ్లేషణ. దీంతో కాంగ్రెస్ పార్టీ లాభపడింది.
బీజేపీ–అకాలీదళ్ కూటమికి నాలుగు సీట్లే
రాష్ట్రంలోని మొత్తం 13 లోక్‌సభ సీట్లలో బీజేపీ–శిరోమణి అకాలీదళ్ కూటమి కేవలం నాలుగు చోట్లే విజయం సాధించింది. వీటిలో శిరోమణి అకాలీదళ్‌కి రెండు సీట్లు ఫిరోజ్‌పూర్, భటిండా దక్కాయి. ఈ రెండు సెగ్మెంట్లలో హిందువుల ఓట్లు ఎక్కువ. వీరి మద్దతుతోనే ఇక్కడ అకాలీ కేండిడేట్లు గెలిచినట్లు రాజకీయ పండితుల విశ్లేషణ. కూటమిలో భాగస్వామ్యపక్షంగా ఉన్న బీజేపీకి కూడా రెండే సీట్లే వచ్చాయి. గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేసిన సిటీ నటుడు సన్నీ డియోల్ అలాగే హోషియార్‌పూర్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన సోమ్ ప్రకాశ్ గెలిచారు. సంగ్రూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కేండిడేట్ భగవంత్ మాన్ విజయం సాధించారు. ఇవన్నీ ఇలా ఉంటే ఎనిమిది లోక్ సభ సెగ్మెంట్లను గెలుచుకుని కాంగ్రెస్ సత్తా చాటింది.
రెండేళ్లయినా మారని బాదల్
రెండేళ్ల క్రితం పంజాబ్‌లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ అకాలీదళ్ వైఖరిలో మార్పు రాలేదు.2007 నుంచి వరుసగా రెండుసార్లు అధికారంలో కంటిన్యూ అయిన ప్రకాశ్ సింగ్ బాదల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె దిగాల్సి వచ్చింది. బీజేపీ–అకాలీల జోడీని పంజాబీలు ఓడించి… కాంగ్రెస్‌కి అధికారం కట్టబెట్టారు. 2017లో అకాలీల ఓటమికి ప్రధాన కారణంగా ముఖ్యమంత్రి బాదల్ ఫ్యామిలీ ఫీలింగే కారణమంటారు. బాదల్ సీఎంగా ఉంటే, ఆయన కొడుకు సుఖ్‌వీర్ సింగ్ బాదల్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాదల్ కోడలు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ భటిండాలో నెగ్గి, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. దీంతో జనాలు బాదల్ కుటుంబ పాలనను కాదని కెప్టెన్ అమరీందర్ నాయకత్వానికి ఓటేశారు. అయినా బాదల్ మారలేదని తాజాగా ముగిసిన 2019 లోక్‌సభ ఎన్నికలు చెబుతున్నాయి. అకాలీదళ్ రెండు సీట్లు గెలిస్తే… వాటిలో ఒక సీటు కొడుకు సుఖ్‌వీర్ సింగ్ గెలిచిన ఫిరోజ్‌పూర్, రెండోది కోడలు హర్‌సిమ్రత్ కౌర్ గెలిచిన భటిండా. వీళ్లిద్దరితో సరిపుచ్చకుండా బాదల్ తన మూడో తరాన్నికూడా రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. సుఖ్‌వీర్–హర్‌సిమ్రత్‌ల పెద్ద కూతురు హర్‌కీరత్ కౌర్, కొడుకు అనంత్‌వీర్ సింగ్ ఫరీద్‌కోట్ నియోజకవర్గంలో చురుకుగా పనిచేస్తున్నారు. బాదల్ సోదరుడి కొడుకు మన్‌ప్రీత్ సింగ్ తన వదిన హర్‌సిమ్రత్‌పై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. మన్‌ప్రీత్ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కొడుకు అర్జున్, కూతురు రియా తండ్రి తరఫున ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.