
దేశంలోని ఎన్నికల సరళిని గమనిస్తే.. గ్రామీణ ప్రాంతాలలో పోలింగ్ 90 % వరకు ఉంటే, విద్యావంతులు, ధనికులు ఉన్న పట్టణాలలో పోలింగ్ 60% కి మించడం లేదు. హైదరాబాద్ నగరంలో చాలా నియోజక వర్గాలలో పోలింగ్ 50% మాత్రమే నమోదు అవుతోంది. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చక చాలామంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. పోలింగ్ శాతం పెంచడానికి రాజకీయ పార్టీలు మంచివారికి టికెట్లు ఇచ్చేటట్టు ఒత్తిడి రావాలి.
ఎన్నికలలో వ్యతిరేక ఓటు నమోదు చేయడానికి 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టు నన్ ఆఫ్ ది ఎబౌవ్ (నోటా) అమలుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ భారత ఎన్నికల కమిషన్ నోటాకు ఒక ప్రత్యేక గుర్తింపుతో ఓటింగ్ ప్యానల్లో చివరగా చేర్చారు.
అప్పటి నుంచి ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో నోటాను చేర్చడం జరిగింది. నోటాతో పోలింగ్ శాతం కొద్దిగా పెరిగింది. 2017వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో శాసనసభకు జరిగిన ఎన్నికలలో నోటాకు మూడో స్థానంలో అంటే, బీజేపీ, కాంగ్రెస్ తరువాత ఎక్కువగా ఓట్లు వచ్చాయి. ఇక 2018వ సంవత్సరంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన సీపీఎం, బీఎస్పీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే, ప్రస్తుతం నోటాకు ఏదో ఒకవిధమైన గుర్తింపు ఉండాలని చర్చ మొదలైంది.
నోటా ఒక కల్పిత అభ్యర్థి
ఈసీ ఆదేశాల మేరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో నోటాకు అత్యధిక ఓట్లు పోలైనా నోటాను గెలిచినట్లు ప్రకటించలేం. నోటా తరువాత అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించాలి. వీటిని దృష్టిలో ఉంచుకొని హర్యానా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలలో నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అంటే ఎన్నికలలో నోటా అత్యధిక ఓట్లు పొందిన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు జరగాలి.
అలాగే మొదటి ఎన్నికలలో పాల్గొన్న అభ్యర్థులు మళ్ళీ జరిగే ఎన్నికలలో (రీ పోల్) పోటీ చేయడానికి వీలులేదు. దేశంలో చాలా రాష్ట్రాలలో పంచాయతీ ఎన్నికలలో నోటాకు గుర్తింపు ఇచ్చేవిధంగా నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా గుర్తిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.
ఇందుకు రాజ్యాంగ సవరణ కానీ, చట్ట సవరణ కానీ అవసరం లేదు. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని చాలాగ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీ పేరిటరాజ్యాంగేతర శక్తులు పనిచేస్తున్నాయి. వీరు గత ఎన్నికలలో సర్పంచ్ పదవిని వేలంపాట ద్వారా ఎంపిక చేసి అధిక డబ్బు ఇచ్చినవారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేటట్లు ఆయనకు ఎదురుగా ఎవరూ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు.
గత పంచాయతీ ఎన్నికలలో సుమారు 16% గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవ ఎన్నికలు జరిగినాయి. సర్పంచ్ పదవిని వేలం వేయడంతో గ్రామంలో డబ్బు ఉన్న వ్యక్తే సర్పంచ్ కావడంతో భారత రాజ్యాంగం కల్పించిన ప్రతి పౌరుడికి ఓటు హక్కుకు విరుద్ధంగా ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయి.
నోటాకు అధికంగా ఓట్లు వేస్తే మళ్ళీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలలో నోటా ఒక కల్పిత అభ్యర్థిగా బరిలో ఉంటే సర్పంచ్ పదవి వేలం ఆగిపోతుంది. అలాగే, పేదలకు ఓటు వేసే వీలు కల్పించడంతో వారికి అభివృద్ధి పనులను నిర్ణయించే హక్కు కలుగుతుంది. బరిలో ఉన్న అభ్యర్థులు మంచివారు కాని పక్షంలో నోటాకు అధికంగా ఓట్లు పడి మళ్లీ ఎన్నికలు జరగడం, ఇంతకు ముందు పోటీ చేసిన అభ్యర్థులను మళ్ళీ జరిపే ఎన్నికలలో పోటీ చేయకుండా చేయడం ఒక విప్లవాత్మక అడుగు. పంచాయతీ ఎన్నికలలో ధనబలం కాక మంచివారు రాజకీయాలలోకి వచ్చే వీలు కలుగుతుంది.
గత కొన్ని రోజులుగా తెలంగాణలో పాలకులు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా ఉండాలని స్థానిక శాసనసభ్యునిపై భారం పెడుతున్నారు. అంటే, రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రజలు ముఖ్యంగా బలహీన వర్గాలవారు ఓటు హక్కు వినియోగించుకొనే పరిస్థితిలో ఉండరు. గ్రామంలోని ప్రజలకు ముఖ్యంగా పేదలకు ఎక్కువశాతం అవసరాలు గ్రామ సర్పంచ్‌తో ఉంటాయి.
నోటాపై ఈసీ నిర్ణయం తీసుకోవాలి
మంచినీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, రేషన్ వంటి పనులకు గ్రామ పంచాయతీతోనే పని ఉంటుంది. అటువంటి సందర్భంలో పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక (కొన్ని సందర్భాలలో వేలం) వంటి వాటితో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు పనికిరాకుండా పోతుంది. కొన్ని గ్రామాలలో సర్పంచ్ పదవికి వేలంపాట మొదలైంది.
గద్వాల్ జిల్లాలోని ఒక గ్రామ సర్పంచ్ పదవి రూ.26 లక్షలకు వేలంపాట జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం అందజేయడం, అలాగే అన్ని రాజకీయ పార్టీలకు నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా గుర్తించాలని లేఖలు రాయడం జరిగింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా రాజకీయ పార్టీలను ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపమని లేఖలు రాయగా ఎవరూ అభ్యంతరం తెలపలేదు. ఈనేపథ్యంలో నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తగు నిర్ణయం తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతోంది.
- ఎం. పద్మనాభరెడ్డి, అధ్యక్షుడు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్-