పద్మా దేవేందర్ రెడ్డికి సహకరించేది లేదు.. మైనంపల్లి రోహిత్​ వర్గం

పద్మా దేవేందర్ రెడ్డికి సహకరించేది లేదు.. మైనంపల్లి రోహిత్​ వర్గం

మెదక్ టౌన్, వెలుగు: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఎన్నికల్లో సహకరించబోమని మెదక్‌‌లో  బీఆర్ఎస్​ పార్టీకి చెందిన సీఎం కేసీఆర్​ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి వర్గం, మైనంపల్లి రోహిత్ వర్గం తీర్మానించారు.  మెదక్​ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్‌‌లో సమావేశమయ్యారు. హవేళీ ఘనపూర్​ ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...  కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా అధిష్టానం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేరు ప్రకటించడం బాధాకరమన్నారు.  మంత్రి హరీశ్​రావు మెదక్​ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనుకుంటే సిద్దిపేటను మాత్రమే అభివృద్ధి చేశారని ఆరోపించారు.   

రెండు మూడు రోజుల్లోగా స్థానికంగా సర్వే చేసి కార్యకర్తలకు నచ్చిన నాయకులకు టికెట్ ఇవ్వాలని 60 ,70 వేల మెజార్టీతో గెలిపిస్తామని  ధీమా వ్యక్తం చేశారు.  ఈ విషయంలో కేసీఆర్​, కేటీఆర్​ ముద్దు... పద్మ వద్దు అనే నినాదంతో ముందుకు సాగుతామని చిన్న శంకరంపేట మండలం సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు.  ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి వెయ్యి ఎకరాల భూమి సంపాదించారన్నారు.   ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి తన సొంత గ్రామం కోనాపూర్‌‌‌‌లోని సొసైటీలో రెండున్నర కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఆరోపించారు.  మెదక్​ అభివృద్ధి విషయంలో మాత్రం మెదక్  మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు.  మెదక్ పట్టణానికి చెందిన న్యాయవాది జీవన్ రావు మాట్లాడుతూ..  ఉద్యమంలో  పాల్గొన్న వారిన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.