సోనియా గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

సోనియా గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీపై బీజేపీ ఎంపీలు సోమవారం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్లమెంటు బడ్జెట్‌‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ సోనియా గాంధీ అభ్యంతరకర పదాలు వాడారని ఆరోపించారు. సోనియా చేసిన కామెంట్లు రాష్ట్రపతి గౌరవానికి భంగం వాటిల్లేలా ఉన్నాయని పేర్కొన్నారు. 

‘‘రాష్ట్రపతికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమె స్థాయి, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. దీని తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి’’ అని బీజేపీ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌‌కు విన్నవించారు. సోనియా గాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఆరోపించారు. 

పార్లమెంట్ పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్థవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పార్లమెంట్‌‌ బడ్జెట్‌‌ సమావేశాల్లో భాగంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత సోనియా గాంధీ మీడియాతో మాట్లాడారు. ప్రసంగం చివరకు వచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారని వ్యాఖ్యానించారు.