తొగుట / దౌల్తాబాద్ వెలుగు : ఈఎంఐలు కట్టనందుకు ఇంటికి నోటీసు అంటించడంతో ఉరేసుకుని ఒకరు చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. దౌల్తాబాద్ కు చెందిన తుమ్మల సత్యనారాయణ (45) రెండేళ్ల కింద ప్రైవేట్ ఫైనాన్స్ లో రూ.16 లక్షలు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. ప్రతి నెల రూ. 22 వేలు చెల్లించడం భారం కావడంతో కొద్ది నెలలుగా ఈఎంఐ కట్టడడంలేదు.
దీంతో ఫైనాన్స్ కంపెనీ నుంచి ఫోన్ చేయడంతో పాటు ప్రతినిధులు ఇంటికి వచ్చి డబ్బులు కట్టమని వేధిస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా పలువురి వద్ద మరో రూ. 5 లక్షలు అప్పు చేశాడు. బుధవారం ఇంటికి ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు నోటీసు అంటించారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన గురువారం ఉదయం కోనాపూర్ గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.
స్థానికులు సమాచారం అందించగా పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులతోనే తన భర్త చనిపోయాడని భార్య రేణుక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.