పంట రుణాలు కట్టినా రైతులకు నోటీసులు
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ సొసైటీలో రైతులు చెల్లించిన సుమారు రూ.30 లక్షల విలువ పంట రుణాల నగదు దుర్వినియోగమైంది. కట్టిన రుణాలు చెల్లించమని రైతులకు నోటీసులు వచ్చాయి. దీంతో సుమారు 30 మంది రైతులు కోటగల్లిలోని ఆఫీస్‌కు వచ్చారు. తాము తీసుకున్న క్రాప్‌లోన్లను 2022లోనే ముట్టజెప్పామని, అప్పటి సొసైటీ కార్యదర్శి శివరాంరాజు, క్యాషియర్ భాస్కర్‌నుంచి తీసుకున్న రశీదు, నోడ్యూస్ సర్టిఫికెట్లను చైర్మన్ శేఖర్, వైస్‌చైర్మన్ రవీందర్‌కు చూపించారు.
డబ్బులు చెల్లించినా లోన్కట్టాలని నోటీసు రావడమేంటని నిలదీశారు. ఆన్లైన్లో పరిశీలించగా, రుణాలు ఇప్పటికీ బాకీ ఉన్నట్లు తెలిసి విస్తుబోయారు. అవినీతి ఆరోపణలతో గతేడాది సస్పెండయిన కార్యదర్శి శివరాం రాజు ఆధ్వర్యంలోనే రైతుల సొమ్ము గోల్మాల్ అయిందని, ఆయనపై విచారణ చేసిన అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని చైర్మన్ శేఖర్ వారికి చెప్పారు. గవర్నమెంట్పంట రుణమాఫీ కూడా తమకు రాలేదని రైతులు తెలిపారు.