సీసీఐ ఆస్తుల వేలానికి నోటీసులు జారీ

ఆదిలాబాద్‍, వెలుగు: ఒకప్పుడు ఆదిలాబాద్‍ జిల్లాకే తలమానికంగా నిలిచిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కాలగర్భంలో కలిసిపోతోంది. లాభాలతో వెలుగు వెలిగిన ఫ్యాక్టరీ 24 ఏండ్లుగా మూతపడి ఉంది. తాజాగా ఆదిలాబాద్ యూనిట్ ను తొలగించేందుకు ఢిల్లీలోని సీసీఐ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసేందుకు ఈ టెండర్లు పిలవాలని నోటీస్​కమ్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్యాక్టరీలోని మెషిన్లు, ఇతర వస్తువులను డిస్పోజల్ చేసి టెండర్లు పిలిచి పూర్తిస్థాయిలో తొలగించాలని నోటీసులో పేర్కొన్నారు.  ఇందులో భాగంగా ఈ నెల 23 వరకు టెండర్లు స్వీకరించనున్నారు. 

లాభాల నుంచి నష్టాల్లోకి..

1978 సంవత్సరంలో ఆదిలాబాద్​ జిల్లాకు సీసీఐ మంజూరు కాగా 1982లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆదిలాబాద్ పట్టణ శివారులో 874 ఎకరాల్లో ప్రభుత్వ భూమితోపాటు 2 వేల ఎకరాలు లీజుకు తీసుకుని రూ. 60 కోట్లతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. కాగా కొన్ని ఆటంకాలతో రెండేళ్లపాటు సిమెంట్ వినియోగించలేదు.  1984 మేలో అప్పటి సీఎం ఎన్టీ రామారావు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ దత్ తివారీ చేతులమీదుగా ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. 1993 వరకు సీసీఐ లాభాలతో నడిచింది. ఆ తర్వాత ప్రభుత్వ లేవీ పద్ధతి( 60 శాతం సర్కారు కొనుగోలు చేయడం) రద్దు చేయడంతో సీసీఐకీ బడ్జెట్ కేటాయింపులు నిలిచిపోయాయి. నష్టాల్లో ఉన్న యూనిట్లను 1996లో బీఐఎఫ్ఆర్ (బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీ కన్స్​ట్రక్షన్) పెట్టారు. 1998 అక్టోబర్​లో సీసీఐలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికీ సీసీఐలో 48 మిలియన్ టన్నుల సున్నపురాయి అందుబాటులో ఉంది. 24 ఏళ్లుగా ఫ్యాక్టరీ మూతబడి ఉండటంతో కోట్ల విలువ చేసే యంత్రాలు తుప్పు పడుతున్నాయి. కొన్నేళ్లుగా చాలామంది మంత్రులు, ఎంపీలు సీసీఐ పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. 

వెలవెలబోతున్న టౌన్ షిప్

సీసీఐ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా టౌన్ షిప్ ఏర్పాటు చేయడంతో వందల కుటుంబాలు అక్కడే ఉండేవి. ఫ్యాక్టరీలో 4 వేల మందికి ఉపాధి కల్పించారు. ఇందులో 550 మంది రెగ్యులర్, మిగతావారు కాంట్రాక్టు ఉద్యోగులు. సీసీఐ ఫ్యాక్టరీ నడిచే సమయంలో టౌన్ షిప్ నిత్యం కళకళలాడేది. టౌన్ షిప్​లో దేశంలోని అన్ని రాష్ట్రాలవారు నివసించేవారు. అలాంటిది ఇప్పుడు 20 మందే ఉన్నారు.

కొనసాగుతున్న పోరాటం

సీసీఐ కోసం ఇప్పటికీ కార్మిక సంఘాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఫ్యాక్టరీకి సంబంధించి హైకోర్టులో రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే విషయంపై ఢిల్లీలో ఉన్న సీసీఐ జనరల్ మేనేజర్ ఉపాధ్యాయతో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మంగళవారం ఫోన్​లో మాట్లాడారు. కోర్టులో ఉన్న కేసులను పట్టించుకోకుండా ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. మరోసారి లీగల్ ఓపీనియన్ తీసుకుంటామని జీఏం చెప్పినట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి విలాస్ తెలిపారు.