పేషెంట్ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు.. హనుమకొండలోని.. ప్రైవేట్ హాస్పిటల్​కు నోటీసులు

  • ట్రీట్ మెంట్ పై అనుమానిస్తూ పేషెంట్ ఫిర్యాదు 
  • హాస్పిటల్ ను తనిఖీ చేసి నోటీసులిచ్చిన డీఎంహెచ్ వో

హనుమకొండ, వెలుగు: ట్రీట్​మెంట్​కోసం వెళ్లిన పేషెంట్ నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేసిన హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్​కు జిల్లా వైద్యాధికారులు నోటీసులు ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. భీమారం గ్రామానికి చెందిన ఓ యువకుడికి కొద్దిరోజుల కిందట జ్వరం రాగా కల్యాణి హాస్పిటల్​కు వెళ్లాడు. అతడిని అడ్మిట్ చేసుకుని వైద్య సిబ్బంది వివిధ టెస్టులు చేశారు. ఆపై శ్వాస సంబంధ ఇబ్బందులున్నాయని వెంటిలేటర్ పై ​ట్రీట్​మెంట్ చేశారు. నాలుగు రోజులకు రూ.4.5 లక్షలు బిల్లు వేసినా తగ్గలేదు.

దీంతో పేషెంట్ ను కుటుంబసభ్యులు అక్కడ్నుంచి హైదరాబాద్​లోని ఆస్పత్రికి  తీసుకెళ్లగా ఒకట్రెండు రోజుల్లోనే ట్రీట్ మెంట్ చేయగా నయం అయింది.  దీంతో కల్యాణి హాస్పిటల్ ట్రీట్ మెంట్ ను  అనుమాని స్తూ బాధిత కుటుంబసభ్యులు ఈనెల 8న హనుమకొండ డీఎంహెచ్​వో ఆఫీస్​లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం డీఎంహెచ్​వో అప్పయ్య హాస్పిటల్ కు వెళ్లి తనిఖీ చేశారు. ట్రీట్​మెంట్​ రేట్ల పట్టిక లేకపోవడం, ఐసీయూ నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

అధిక బిల్లులపై ఆరా తీసి ఆస్పత్రి మేనేజ్ మెంట్ పై మండిపడ్డారు. అనంతరం హాస్పిటల్​యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి.. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో స్థానికంగా కలకలం రేపగా.. సిటీలోని మరికొన్ని ఆస్పత్రులు అలర్ట్​ అయినట్లు తెలిసింది.