హైదరాబాద్, వెలుగు: ఫార్ములా--–ఈ కార్ల రేస్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్, మరికొందరిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. వెంటనే కేసు నమోదు చేసి, ఒకట్రెండు రోజుల్లోనే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఏసీబీ ఉన్నతాధికారులు మంగళవారం సమావేశమై చర్చించినట్టు సమాచారం.
విచారణ టైమ్‌లో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నిపుణుల నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఇది హైప్రొఫైల్ కేసు కావడంతో ఏసీబీ అధికారులు వివరాలన్నీ సీక్రెట్‌గా ఉంచుతున్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.బంజారాహిల్స్‌లోని ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా డైరెక్టర్ నేతృత్వంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(సీఐయూ) ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది.
నోటీసులు ఇచ్చిన అనంతరం కేటీఆర్ సహా మిగతా వాళ్లను ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌లోనే ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఫార్ములా–ఈ రేస్ కార్ల వ్యవహారంలో విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు అక్రమంగా చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌కు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ఆదేశాల మేరకే తాను చెల్లింపులు చేసినట్టు ఆయన వివరణ ఇచ్చారు.
రూల్స్ కు విరుద్ధంగా చెల్లింపులు..
బీఆర్ఎస్ హయాంలో పోయినేడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహించారు. దీనికోసం మొత్తం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్‌ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. సీజన్ 9 విజయవంతం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న సీజన్ 10 నిర్వహించాలని అప్పట్లోనే నిర్ణయించారు. ఇందుకోసం ఫార్ములా–ఈ ఆపరేషన్(ఎఫ్‌ఈవో)తో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్‌లో అగ్రిమెంట్ చేసుకుంది. అగ్రిమెంట్‌కు ముందే అదీ ఎన్నికల కోడ్అమల్లో ఉన్న సమయంలో రూ.55 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించింది.
అది కూడా విదేశాల్లో ఉన్న కంపెనీకి ఆర్బీఐతో పాటు ఇతరత్రా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే చెల్లింపులు చేశారు. ఇలాంటి ఈవెంట్లు నిర్వహించాలంటే ఏదైనా ప్రైవేట్ఏజెన్సీ లేదా కంపెనీ ముందు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి. కానీ సీజన్10 విషయంలో నిబంధనలు పాటించలేదు. నిధులు పంపిన 18 రోజులకు ఎన్నికల కోడ్ టైంలో ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఈసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు. ఈ ఒప్పందం వల్ల హెచ్ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడింది. ఎఫ్ఈవోకు సంబంధించిన వారితో ముఖాముఖి చర్చలు కాకుండా, అన్నీ ఈమెయిల్ ద్వారానే కథ నడిపించారు.
ఈడీ ఎంటరయ్యే చాన్స్..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించింది. సీజన్ 10 కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. విదేశీ కంపెనీకి చెల్లించిన ప్రభుత్వ సొమ్ము రూ.55 కోట్లపై వివరణ ఇవ్వాలని స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్‌కు నోటీసులు పంపింది. అయితే ఈ విషయంలో తన పాత్ర ఏమీ లేదని, అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ చెబితేనే చేశానని అర్వింద్ కుమార్ సమాధానం ఇచ్చారు.
దీంతో ఈ వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ప్రభుత్వం.. ఎంక్వైరీ కోసం ఏసీబీకి ఆదేశాలిచ్చింది. నిధుల దుర్వినియోగంపై అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ నుంచి అనుమతి తీసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు నమోదుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు.
దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ రికార్డులు సహా ఫార్ములా–ఈ రేస్ ఈవెంట్ కోసం విడుదల చేసిన నిధులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పటికే సేకరించారు. విదేశాలకు డబ్బు తరలింపు అంశం కావడంతో ఈడీ కూడా కేసు నమోదు చేయనున్నట్టు తెలిసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం.