గుట్కా కేసులో స్టార్స్ హీరోలకు నోటీసులు

గుట్కా పాన్ మసాలా యాడ్స్‌ చేసిన ముగ్గురు బాలీవుడ్‌ స్టార్ హీరోలకు కేంద్రం షోకాజ్‌ నోటీసులిచ్చామని తెలిపింది. స్టార్ హీరోలు హానికర ఉత్పత్తులను ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై.. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ హైకోర్టులో  విచారణ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది కేంద్రం. నోటీసులు అందుకున్న వారిలో షారుక్‌ ఖాన్‌ (ShahRukh Khan), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) ఉన్నారని తెలిపింది.

స్టార్ హీరోలు హానికారక ఉత్పత్తుల ప్రచార ప్రకటనల్లో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. న్యాయవాది మోతీలాల్‌ యాదవ్‌ గతంలో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్‌ తెలిపిన అభ్యంతరాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు స్పందన కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీచేసింది. దానిపై స్పందించిన డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే.. ఆ విషయంపై కోర్టుకు సమాచారం అందజేశారు. షారూక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌లకు అక్టోబర్‌ 22న షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని చెప్పారు. అంతేకాకుండా.. అమితాబ్‌ కూడా సదరు కంపెనీకి ఇప్పటికే లీగల్‌ నోటీసులు పంపారని, ఈ వ్యవహారంపై ఒక కేర్ సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, కాబట్టి ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు పాండే. దాంతో కోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.