పాల్వంచ రామకృష్ణ ఆత్మహత్య కేసులో... వనమా రాఘవను అరెస్ట్ చేయాలంటూ విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. చనిపోయేముందు రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేయడంతో.. వనమా రాఘవ అరెస్ట్ కు ఒత్తిడి పెరుగుతోంది. వనమా రాఘవ చెప్పినట్లు చేయలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించాడు. తన భార్యను పంపిస్తేనే సమస్య పరిష్కరిస్తానని.. లేకపోతే రూపాయి కూడా రాదని రాఘవ బెదిరించాడన్నారు రామకృష్ణ. సూసైడ్ నోట్ లో కూడా వనమా రాఘవ పేరు పెట్టాడు రామకృష్ణ. అయినా వనమా రాఘవను అరెస్ట్ చేయకపోవడంపై మండిపడుతున్నారు విపక్ష పార్టీల నేతలు.
ఇక రాఘవను శిక్షించాలంటూ రాష్ట్రమంతా ఆందోళనలు పెరగడంతో.. ఓ బహిరంగలేఖ విడుదల చేశారు MLA వనమా వెంకటేశ్వర రావు. తన కొడుకును పోలీసులకు అప్పగిస్తానంటూ లేఖ రాశారు. ఎట్ ది సేమ్ టైమ్ రాఘవను అరెస్ట్ చేసినట్లు లీకులిచ్చారు పోలీసులు. దీంతో రాఘవను అదుపులోకి తీసుకున్నట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. ట్విస్టుల మీద ట్విస్టుల తర్వాత కొత్తగూడెం పోలీసులు మాత్రం ఇంకా వనమా రాఘవ కోసం గాలిస్తున్నామంటూ ప్రకటించారు. రాఘవ కోసం ఏడెనిమిది టీములతో వెతుకుతున్నామని తెలిపారు.
మరోవైపు పాల్వంచనలోని వనమా రాఘవ ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు పోలీసులు. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నరకు పాల్వంచ పీఎస్ లో ఏసీపీ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. విచారణకు సహకరించాలని నోటీసులో కోరారు.