రేషన్ కష్టాలకు చెక్  .. జిల్లాలో  రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 

రేషన్ కష్టాలకు చెక్  .. జిల్లాలో  రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ 
  • కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లలో 42 షాపుల భర్తీకి నోటిఫికేషన్​జారీ
  • డీలర్ల భర్తీతో లబ్ధిదారులకు తప్పనున్న ఇబ్బందులు 

కామారెడ్డి​, వెలుగు: కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న 42  రేషన్ షాపుల్లో డీలర్ల  భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.  చాలా గ్రామాల్లో ఏళ్ల తరబడి ఈ సమస్య ఉండగా..  లబ్ధి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇన్ చార్జి డీలర్లతోనే  నెట్టుకొస్తుండగా..  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను కలిసి సమస్యను పరిష్కరించాలని సూచించారు.  దీంతో  సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లతో మాట్లాడిన కలెక్టర్  ఖాళీగా ఉన్న రేషన్ షాపుల వివరాలను తెలుసుకొని వెంటనే భర్తీ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

జిల్లాలో  మొత్తం ఫుడ్​సెక్యూరిటీ కార్డులు (ఆహార భద్రత కార్డులు)  2,53, 458, అంత్యోదయ కార్డులు  17,665, అన్నపూర్ణ కార్డులు 914 ఉండగా.. 578 రేషన్​ షాపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఇందులో 89 ఖాళీలు ఉన్నాయి.  ప్రస్తుతం 489 మంది డీలర్లు ఉన్నారు.  గతంలో  నియమాకమయిన డీలర్​ చనిపోవటం,  కొందరు వివిధ కారణాలతో  వదిలేయటం, అక్రమాలకు పాల్పడిన దృష్ట్యా కొందరిని గతంలో తొలగించటంతో ఖాళీలు ఏర్పడ్డాయి.  ఖాళీగా ఉన్న గ్రామాల్లో  పక్క గ్రామ డీలర్లకు ఇన్​చార్జి  బాధ్యతలు ఇచ్చారు.   కొన్ని షాపులకు 10 ఏళ్లుగా ఇన్​చార్జి ఉంటున్నారు.   స్థానికులు పలుమార్లు డీలర్​ పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నప్పటికీ  అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.  

భర్తీకి నోటిఫికేషన్​

కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలో 2 నియోజక వర్గాలు వస్తాయి. ఈ డివిజన్లలో  ఖాళీగా ఉన్న   42 షాపుల డీలర్ల భర్తీ కోసం ఆర్డీవోలు నోటిఫికేషన్​ జారీ చేశారు.  కామారెడ్డి డివిజన్లో  34,  ఎల్లారెడ్డి డివిజన్లో 8 షాపులకు  నోటిఫికేషన్​ ఇచ్చారు.  గ్రామాల వారీగా  రిజర్వేషన్లను కూడా ప్రకటించారు.  అప్లయ్​ చేసుకున్న వారి అర్హతలు పరిశీలించి ఆఫీసర్లు సెలక్ట్ చేస్తారు.  భిక్కనూరు మండలంలో 5,  దోమకొండలో 2, కామారెడ్డిలో 8,  పాల్వంచలో 2, రాజంపేటలో 5, రామారెడ్డిలో 5,  సదాశివనగర్​లో 4, తాడ్వాయిలో 3,  ఎల్లారెడ్డిలో 2,  లింగంపేటలో 1, నాగిరెడ్డిపేటలో 5 షాపుల భర్తీకి నోటిఫికేషన్​ ఇచ్చారు.  ఆగస్టు నెలాఖరులోగా భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.   బాన్సువాడ రెవిన్యూ డివిజన్​ పరిధిలో ని జుక్కల్, బాన్సువాడలో  47 షాపుల్లో కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు.

డీలర్లు లేక ఇబ్బందులు 

రేషన్​ షాపులకు డీలర్లు లేక పోవటంతో  ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం బయోమెట్రిక్​ సిస్టమ్​ ద్వారా  బియ్యం పంపిణీ  చేస్తున్నారు.  డీలర్​ కూడా  బయోమెట్రిక్​ పెట్టాలి. ఎవరి పేరిట షాపు ఉందో వారు బయోమెట్రిక్​ చేస్తేనే  ఆన్​లైన్​ఓపెన్​ అవుతుంది.  ఇన్​చార్జి ఉన్న గ్రామాలతో పాటు, రెగ్యులర్​గా ఉన్న గ్రామాల్లో ఒకే వ్యక్తి  బయోమెట్రిక్​ సిస్టమ్​ ద్వారా బియ్యం పంపిణీకి ఆలస్యం అవుతోంది.

 ఇన్​చార్జి ఉన్న షాపుల్లో  2, 3 రోజుల్లో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరైనా లబ్ధిదారులు లేక పోతే రేషన్​ తీసుకునే విలులేదు.  స్థానికంగా డీలర్​ ఉంటే ఉదయం, సాయంత్రం లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తారు. ఇటీవల పలు గ్రామాల ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లారు.