స్పీడ్​ పెంచిన పార్టీలు .. ప్రచారం వ్యూహాల్లో లీడర్లు

  • బహిరంగ సభలతో గులాబీ లీడర్ల దూకుడు
  •  పసుపు బోర్డు ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో జోష్
  •  ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ధీమా
  •  జిల్లాలో రసవత్తరంగా రాజకీయ పరిణామాలు

జగిత్యాల, వెలుగు:  జగిత్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పొలిటికల్ పార్టీలు స్పీడ్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే వ్యూహాలు రెడీ చేసుకుంటున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. సంక్షేమ పథకాలను నమ్ముకొని మరోసారి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ లీడర్లు ప్రజల్లోకి వెళ్తున్నారు. కాగా క్షేత్రస్థాయిలో మారుతున్న సమీకరణాలతో ప్రజల నాడి పట్టుకోవడం రాజకీయ పార్టీలకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. 

స్పీడ్ పెంచిన బీఆర్ఎస్

హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ లీడర్లు స్పీడు మరింత పెంచారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రాష్ట్ర స్థాయి లీడర్ల సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల మద్దతు కూడుతున్నారు. అందులో భాగంగా జగిత్యాల, ధర్మపురిలో ఒకేరోజు రెండు బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఈ సభలకు హాజరైన మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ క్యాడర్‌‌లో ఉత్సాహం నింపారు.  మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇచ్చారు. కేటీఆర్ టూర్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలో కోరుట్లలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు పర్యటించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌రావు కొడుకు సంజయ్‌ని గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్య నాయకుల పర్యటనలకు తోడు ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

6 గ్యారంటీలతో కాంగ్రెస్

జిల్లాలో కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గట్టెక్కాలని 6 గ్యారంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్తోంది. గత ఎన్నికల్లో కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో గెలుపు దగ్గరికి వచ్చి ఆగిపోగా.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. జగిత్యాలలో గత ఫలితాలు రిపీట్ కాకుండా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి 6 గ్యారంటీ పథకాలు అమలుచేయడంతోపాటు ప్రస్తుత కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ రూ.లక్షతోపాటు తులం బంగారం  ఇస్తామని జీవన్ రెడ్డి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ లీడర్లకు ఏ చిన్న అవకాశం దొరికినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను  ఎత్తిచూపుతున్నారు.

బీజేపీలో పసుపు జోష్

పసుపు బోర్డు ప్రకటనతో బీజేపీలో కొత్త జోష్ నెలకొంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో పసుపు పండించే రైతులు ఎక్కువగా ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే మామిడి ఎగుమతికి ప్రత్యేక కిసాన్ రైలు ఏర్పాటు చేసి మ్యాంగో రైతుల దృష్టిని బీజేపీ ఆకర్షించింది. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలం ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా  ఎత్తి చూపిస్తూ అక్కడ పాగా వేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. జగిత్యాలలో కూడా బీసీ మహిళకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించి గెలిపించుకునేందుకు ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. ఇటు రైతుల ఓట్లతోపాటు కులాల వారీగా సమీకరణాలు చేసుకుంటూ గెలుపే లక్ష్యంగా కమలదళం ముందుకు సాగుతోంది.