తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన పోస్టులు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్(ఐబీపీఎస్) క్లర్క్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ మొదలయ్యాయి. ఫస్ట్ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 1557 క్లర్క్ జాబ్స్ మాత్రమే ఉండగా.. రీసెంట్గా రిలీజ్ చేసిన రీ నోటిఫికేషన్లో మరో1000 పోస్టులు పెరిగాయి. అన్నీ కలిపి 2557 ఖాళీలు ఉండగా.. తెలంగాణలో– 62, ఏపీలో 85 పోస్టులు ఉన్నాయి. లక్షల సంఖ్యలో పోటీపడే క్లర్క్ జాబ్ కొట్టడం ఎలా.. ప్రిపరేషన్ ఈజీ అవడానికి ఏం చదవాలి, ఏయే సబ్జెక్ట్లపై ఫోకస్ పెట్టాలి.. తదితర అంశాలపై ప్రిపరేషన్ ప్లాన్ ఈ వారం.
లక్షల సంఖ్యలో పోటీపడే బ్యాంక్ క్లర్క్ కొలువు కొట్టడం ఎలా.. ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి.., ఏయే సబ్జెక్టులపై ఫోకస్ పెట్టాలి… పూర్తి వివరాలతో ప్రిపరేషన్ ప్లాన్.
బ్యాంకు పరీక్షల సిలబస్ మిగతా గవర్నమెంట్ ఎగ్జామ్స్ సిలబస్‌తో పోలిస్తే చాలా తక్కువ. ప్రతి సంవత్సరం 6 నుంచి 8 క్లర్క్, పీవో పోస్టులకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అన్ని బ్యాంకు పరీక్షల సిలబస్ దాదాపు ఒకటే. ప్రిలిమ్స్‌లో అభ్యర్థి వేగం, కచ్చితత్వంపై, మెయిన్స్‌లో విషయావగాహనపై ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. సిలబస్‌లో ఇచ్చిన అంశాలను బేసిక్ స్థాయి మొదలు డెప్త్ వరకు ప్రాక్టీస్ చేయగలిగితే జాబ్ కొట్టడం ఈజీ. ఐబీపీఎస్ సెలెక్షన్ ప్రాసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు స్టేజిలలో ఉంటుంది.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ను స్పీడ్ మ్యాథ్స్, అర్థిమెటిక్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ ఇలా మూడు భాగాలుగా ప్రిపేరవ్వాలి. స్పీడ్ మ్యాథ్స్‌లో సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్, నెంబర్ సిరీస్, క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. వీటి కోసం వేదిక్ మ్యాథ్స్‌ను ఉపయోగించి ఎక్కాలు 20 వరకు, వర్గాలు 30 వరకు, ఘనాలు 20 వరకు, కూడిక, గుణకారం, వర్గమూలం, ఘనమూలాలు నేర్చుకుంటే ఎగ్జామ్ ఈజీ అవుతుంది.
అర్థిమెటిక్లో పర్సంటేజ్, రేషియో ప్రపోర్షన్, ప్రాఫిట్–లాస్, ఏజస్, పార్ట్నర్షిప్, ఎస్ఐ అండ్ సీఐ, పైప్స్అండ్ సిస్టర్న్స్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, బోట్స్ అండ్ స్ప్రీమ్స్, యావరేజస్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబులిటీ, మెన్స్యూరేషన్ తదితర చాప్టర్లపై ఫోకస్ పెట్టాలి.
డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో రెండు రకాల సమస్యలు ఉంటాయి. పర్సంటేజీలు, రేషియో, యావరేజీలను ఉపయోగించి సాధించే సమస్యలు, ఎస్సై అండ్ సీఐ, టైం అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబులిటిలను ఉపయోగించి సాధించే సమస్యలు ఉంటాయి. వీటిని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ అంత ఈజీ అవుతుంది.
రీజనింగ్ ఎబిలిటీ
ప్రీవియస్ పేపర్లను గమనిస్తే రీజనింగ్ఎబిలిటీలో ఎక్కువగా సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్ ల నుంచే 15 నుంచి 20 వరకు ప్రశ్నలు అడుగుతున్నారు. వీటితో పాటు డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్, కోడెడ్ ఇనీక్వాలిటీ, ఆల్ఫాబేట్ టెస్ట్, కోడింగ్ అండ్ డికోడింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, సిలాగిజం, డేటా సఫిషియేన్సి, ఇన్పుట్–అవుట్‌పుట్, స్టేట్మెంట్స్ అండ్ అస్యంప్సన్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. బ్యాంకు ప్రీవియస్ పేపర్లలో ఇచ్చిన ప్రశ్నలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి మాక్ టెస్ట్ 18 నుంచి 20 నిమిషాలలో పూర్తి చేయగలిగితే స్పీడ్ పెరిగినట్లు లెక్క.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
బ్యాంక్ ఎగ్జామ్‌లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ కీలకం. అందుకే వొకాబులరీ పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇంగ్లిష్ లో వొకాబులరీతోనే సగానిపైగా మార్కులు స్కోర్ చేయొచ్చు. రోజుకు 5 కొత్త పదాల చొప్పున నేర్చుకుంటూ గ్రామర్ అంశాలపై ఫోకస్ పెడితే మేలు.
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్, వర్డ్ స్వాపింగ్, పారాజంబుల్, మ్యాచ్ ది కాలమ్, ఇడియమ్స్ అండ్ ప్రేజస్ వంటి టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
జనరల్ / ఫైనాన్సియల్ అవేర్నెస్
జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ ను స్టాటిక్ జీకే, ఫైనాన్షియల్ అవేర్నెస్, కరెంట్ ఎఫైర్స్ అని మూడు కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు.
స్టాటిక్ జీకే: స్టాటిక్ జీకేలో కంట్రి, కరెన్సీ అండ్ క్యాపిటల్, ప్రపంచంలో, దేశంలో మొట్టమొదటివి, భారత రాజ్యాంగం, భారతీయ సంస్కృతి, విమానాశ్రయాలు, రైల్వేలు, చరిత్ర, జాగ్రఫి అంశాలపై ఫోకస్ పెట్టాలి.
ఫైనాన్షియల్ అవేర్నెస్: ఇందులో ఇండియన్ బ్యాంకింగ్, ఇంపార్టెంట్ డేట్స్, బ్యాంక్ హెడ్‌క్వార్టర్, రెగ్యులేటరీ బాడీస్, ఆర్బీఐ విధులు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మొదలైనవి చూసుకోవాలి.
కరెంట్ ఎఫైర్స్: ప్రభుత్వ స్కీమ్స్, ఇంటర్నేషనల్, నేషనల్ డేట్స్, అవార్డులు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, అవార్డులు, సదస్సులు వంటి సమాచారాన్ని ఎగ్జామ్‌కు ఆరు నెలల ముందువి స్టడీ చేయాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
అభ్యర్థికి కంప్యూటర్స్ పై ఉన్న బేసిక్ నాలెడ్జ్‌ను టెస్ట్ చేసేలా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి కంప్యూటర్ల పరిచయం, ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్, కీబోర్డ్ షార్ట్‌కట్స్, అబ్రివేషన్స్ చూసుకోవాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇందులో మూడు విభాగాల్లో100 ప్రశ్నలకు 60 నిమిషాల టైమ్ ఉంటుంది. ప్రతి సెక్షన్ 20 నిమిషాలలో పూర్తి చేయాల్సిందే. కొత్తగా ఐబీపీఎస్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ టైమ్ మేనేజ్మెంట్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. న్యూమరికల్, రీజనింగ్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే తక్కువ టైమ్‌లో ఆన్సర్ చేయడం వీలవుతుంది.
మెయిన్స్: మెయిన్స్‌లో మొత్తం నాలుగు సెక్షన్లలో 190 ప్రశ్నలను 160 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో సెక్షన్‌కు కేటాయించిన టైమ్ పూర్తయిన తర్వాతే మరో సెక్షన్ ఓపెన్ అవుతుంది.
ప్రాక్టీస్ ఇంపార్టెంట్
బ్యాంక్ క్లర్క్ జాబ్‌కు ప్రిపేరయ్యే వారు అక్యురసీ బాగా మెయింటెయిన్ చేయాలి. వీలైనన్ని ఎక్కువ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేస్తే మంచిది. మెయిన్స్‌లో ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్పై ఫోకస్ పెడితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. దాదాపు ఇంగ్లీష్ సబ్జెక్టే డిసైడింగ్ ఫ్యాక్టర్. అందుకే మొదటి నుంచి దానిపై ప్ర్యతేక దృష్టి పెట్టాలి. రోజూ ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్ చదవడం అలవాటు చేసుకుంటే ఇంగ్లిష్ పెరగడంతోపాటు కరెంట్ ఎఫైర్స్కు ఉపయోగపడుతుంది.–శ్రీనివాస్ గాజుల, కెనరా బ్యాంక్ క్లర్క్, వెదిర, కరీంనగర్.