హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో కారుణ్య నియామకాల ద్వారా బదిలీ వర్కర్లుగా, జనరల్ మజ్దూర్లుగా భూగర్భ గనుల్లో పనిచేస్తున్న విద్యావంతులైన యువ కార్మికులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందడానికి సంస్థ ప్రయత్నాలు షురూ చేసింది. వివిధ విభాగాల్లో ఏర్పడిన 986 ఖాళీల భర్తీకి ఇన్ సర్వీస్ ఉద్యోగుల కోసం ఇంటర్నల్ నోటిఫికేషన్లను సింగరేణి సీఎండీ ఎన్.బలరాం విడుదల చేశారు. ఈ పోస్టుల్లో 204 అధికార హోదా పోస్టులు కాగా, 782 టెక్నీషియన్, కార్మిక స్థాయి పోస్టులు ఉన్నాయని సింగరేణి వర్గాలు వెల్లడించాయి.
దాదాపు 16 వేల మంది యువకులు భూగర్భ గనుల్లో బదిలీ వర్కర్లుగా, జనరల్ మజ్దూర్లుగా పనిచేస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ అర్హతలున్న వారు ఉన్నారు. సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 986 పోస్టులను విద్యా అర్హతలు గల బదిలీ వర్కర్లు, ఇన్ సర్వీస్ కార్మికులతో నింపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సంస్థ రెండు ఇంటర్నల్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అలాగే సింగరేణి సంస్థ ఎక్స్ టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 599 పోస్టుల భర్తీకి రెండు ప్రకటనలు జారీ చేసింది. వీటిలో మొదట 272 ఉద్యోగాలకు మరో 327 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.