లైన్ అంపైర్‌కు బాల్‌ను కొట్టిన సెర్బియన్
యూఎస్ ఓపెన్ నుంచి డిస్ క్వాలిఫై
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వరల్డ్ నంబర్‌వన్, సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్.. అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆదివారం మెన్స్ సింగిల్స్ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో జొకో.. వెనక్కి కొట్టిన బాల్ అనుకోకుండా లైన్ జడ్జ్‌కు గొంతు భాగంలో బలంగా తాకడంతో ఆమె కుప్పకూలింది. ఫ్యాబ్లో కారెనో బుస్టా (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దశలో 5–6తో వెనుకబడ్డ జొకో.. కీలక టైమ్‌లో గేమ్‌ను కోల్పోవడంతో ఆగ్రహంతో బాల్‌ను రాకెట్‌తో వెనక్కి కొట్టగా అది లైన్ జడ్జ్‌కు తగిలింది. దీంతో రంగంలోకి దిగిన మ్యాచ్ రిఫరీ సోరెన్ ఫ్రీమెల్, గ్రాండ్‌స్లామ్ సూపర్ వైజర్ ఎగ్లీ, చైర్ అంపైర్ ఔరెల్లీ టార్చీ.. జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. దాదాపు 10 నిమిషాల పాటు జొకోవిచ్‌తో చర్చలు జరిపిన నిర్వాహకులు.. సెర్బియన్ను టోర్నీ నుంచి తప్పించారు. యూఎస్ ఓపెన్ రూల్స్ ప్రకారం ఏ ఆటగాడు కూడా ప్రమాదకరంగా బాల్‌ను విసరకూడదు. అలా ప్రవర్తించిన ప్లేయర్‌పై కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈ నిర్ణయంతో జొకో ఇప్పటివరకు టోర్నీలో సాధించిన 25 వేల యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీతో పాటు కొన్ని ర్యాంకింగ్ పాయింట్లను కూడా కోల్పోతాడు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ జొకో రెండు చేతులు జోడించి కొద్దిసేపు ప్రాధేయపడినా ఆర్గనైజర్స్ రూల్స్ ప్రకారమే వెళ్లారు. ఇక, ప్రిక్వార్టర్స్‌లో మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ డేవిడ్ గొఫిన్కు చుక్కెదురైంది. 12వ సీడ్ డెనిస్ షెపవలోవ్ (కెనడా) 6-–7 (0/7), 6–3, 6–4, 6–3తో గొఫిన్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు. ఐదో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–2, 6–1తో డవిడొవిచ్ (స్పెయిన్)పై గెలిచాడు.
ఫేవరెట్‌గా బరిలోకి దిగి..
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జొకోవిచ్ అర్ధాంతరంగా నిష్క్రమించడం టెన్నిస్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. మొత్తానికి కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న జొకో ఆశలకు కళ్లెం పడగా, 29 వరుస విజయాలకు కూడా బ్రేక్ పడింది. లెజెండ్ ప్లేయర్లు రోజర్ ఫెడరర్ (20), రఫెల్ నడాల్ (19) లేకపోవడంతో కచ్చితంగా ఈసారి యూఎస్ టైటిల్ జొకోదేనని అందరూ భావించారు. కానీ, అతని నిష్ర్కమణతో మెగా టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించనున్నాడు.
మిశ్రమ స్పందన..
జొకోవిచ్ ఘటనపై టెన్నిస్ వరల్డ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జొకో కోపంతో చేశాడని కొందరు అంటుండగా, మరికొందరు అనుకోకుండా జరిగిన ఘటనగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ టైమ్‌లో కోర్టులో ఏం జరిగిందో వీడియోను షేర్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. అయితే ఆటలో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయి. గతంలోనూ చాలా మంది ప్లేయర్ల విషయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కొంత మంది రాకెట్‌ను విరగ్గొడితే, మరికొంత మంది ఫ్యాన్స్‌తో, అంపైర్లతో, లైన్ జడ్జ్‌లతో వాగ్వాదానికి దిగారు. అయితే ప్లేయర్లపై ఇలా చర్యలు తీసుకున్న సంఘటనలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.
ఒసాకా ముందుకు.. క్విటోవా ఇంటికి
మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ నవోమి ఒసాకా క్వార్టర్స్ చేరగా.. ఆరో సీడ్ పెట్రా క్విటోవా ఇంటిదారి పట్టింది. ప్రి క్వార్టర్స్‌లో ఒసాకా (జపాన్) 6–3, 6–4తో 14 సీడ్ కొంటావిట్ (ఇస్తోనియా)పై గెలిచింది. క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (5/7), 6–3, 6–7 (6/8)తో షెబ్లీ రోజర్స్ (అమెరికా) చేతిలో పోరాడి ఓడిపోయింది.
చాలా బాధపడుతున్నా
ఈ వ్యవహారంపై జొకోవిచ్ విచారం వ్యక్తం చేశాడు. ‘ఆ టైమ్‌లో నేను కోపంగా ఉన్నా. బాల్‌ను కొట్టా. అది లైన్ అంపైర్‌కు తాకింది. నేను కావాలని ఆ పని చేయలేదు. అలా చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇందులో నా తప్పు లేదు. కానీ బాధ్యత వహించాల్సిందే. ఆమెకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నా. నన్ను డిస్క్వాలిఫై చేయడం బాధగా ఉంది. ఈ ఘటన నాకో గుణ పాఠం లాంటిది. యూఎస్ ఓపెన్‌కు సారీ చెబుతున్నా’ అని జొకో వ్యాఖ్యానించాడు.