Australia Open 2025: ముగిసిన జకోవిచ్‌ పోరాటం.. ఫైనల్లో జ్వెరెవ్‌

Australia Open 2025: ముగిసిన జకోవిచ్‌ పోరాటం.. ఫైనల్లో జ్వెరెవ్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో సెర్బియన్ స్టార్ నొవాక్‌ జకోవిచ్‌ పోరాటం ముగిసింది. శుక్రవారం(జనవరి 24) జర్మన్ ప్లేయర్ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో తొలి సెట్‌ అనంతరం సెర్బియన్ స్టార్ వాకోవర్ ఇచ్చేశాడు. గాయం కారణంగా ఆటను కొనసాగించలేక.. అభిమానులకు అభివాదం చేస్తూ కోర్టును వీడాడు.దాంతో, జర్మనీ స్టార్ జ్వెరెవ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. 

తొలి సెట్‌‌లో హోరీహోరీ పోరు.. 

ఇద్దరు ఛాంపియన్లు కావడంతో తొలి సెట్ హోరీహోరీగా నడిచింది. ఓ వైపు గాయం బాధ పెడుతున్నా.. జకోవిచ్‌ మాత్రం పట్టువదల్లేదు. సర్వీస్ బ్రేక్ అవ్వకుండా టై బ్రేక్ వరకూ తీసుకెళ్లాడు. చివరకు టై బ్రేక్‌లో జ్వెరెవ్‌ 7-6 (7/5) తేడాతో తొలి సెట్ గెలుచుకున్నాడు. దాదాపు గంట 21 నిమిషాల పాటు సాగిన తొలి సెట్‌ సాగింది.

అంతకుముందు జోకోవిచ్.. క్వార్టర్-ఫైనల్‌లో కార్లోస్ అల్కారాజ్‌ను ఓడించాడు. ఆ మ్యాచ్‌లోనే గాయం ఇబ్బంది పెట్టినా.. ప్రేక్షకుల వెకిలి చేష్టలతో శక్తినంత కూడగట్టుకొని ఆడాడు. తొలి సెట్ కోల్పోయినప్పటికీ, అనంతరం వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.