Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!

Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!

నవంబర్​ 14.. బాలలదినోత్సవం.. చిల్డ్రన్స్​ డే.. రోజూ పెట్టే ఫుడ్​కాకుండా.. ఈ రోజు ( నవంబర్​ 14) పిల్లలకు వెరైటీ ఫుడ్​ పెట్టండి.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కానీ రోజంతా ఇంట్లో, బయట పనులుంటాయి.. పిండి వంటలు చేయాలంటే  కష్టమే. అందుకే బియ్యప్పిండితో చేసిన ఈ వంటకాల్ని పిల్లలకు  రుచి చూడండి. సంతోషంతో పాటు  ఆరోగ్యాన్నికూడా దృష్టిలో ఉంచుకొని వీటిని తయారు  చేసుకుని తినండి..

పాలతాళికలు తయారీకి కావలసినవి

బియ్యప్పిండి- ఒకటిన్నర కప్పు 
పాలు‌‌ అర లీటరు
 నెయ్యి -ఐదు టీ స్పూన్లు
 చక్కెర- రెండు కప్పులు
 పచ్చి కొబ్బరి తురుము-ఒక కప్పు
 యాలకుల పొడి - ఒక టీ స్పూన్

తయారీ విధానం: గిన్నెలో నీళ్లు  మరిగించి అందులో బియ్యప్పిండి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని కాసేపు చల్లార్చాలి. ఇప్పుడు కారప్పూస  గిద్దెలకు  నూనె రాసి ఆమిశ్రమాన్ని పెట్టి నూడిల్స్​లా ఒత్తాలి. మరోగిన్నెలో పాలు మరిగించి పిండి తో చేసుకున్న తాళికల్ని ఉడికించాలి. మరొక పాన్​ లో  నెయ్యి వేసి కిస్​ మిస్​  జీడిపప్పు పలుకుల్ని వేగించి పాలల్లో వేయాలి. ఆతర్వాత కొబ్బరి తురుము, చక్కెర, యాలకుల పొడి కలిపి కాసేపు మరిగించి దింపేయాలి. వేడి వేడి పాల తాలికలు రెడీ.

Also Read : పిల్లలతో ఇలా గడపండి

తీపి పునుగులు తయారీకి కావలసినవి

ఓట్స్ పొడి- ఒక కప్పు
చక్కెర పొడి- ఒక కప్పు 
మైదా- ఒక కప్పు
జీడిపప్పు కప్పు 
ఉప్పు- చిటికెడు 
నూనె- సరిపడా 
బియ్యప్పిండి- అర కప్పు 
కాచి చల్లార్చిన పాలు -ఒక కప్పు 
యాలకుల పొడి - ఒక టీ స్పూన్

తయారీ విధానం: గిన్నెలో బియ్యప్పిండి, చక్కెర, ఓట్స్ పొడి, జీడిపప్పు, మైదా యాలకుల పొడి, ఉప్పు వేసిబాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కొద్దికొద్దిగా పాలు పోస్తూ పునుగుల పిండిలా కలపాలి. తర్వాత స్టన్ పై పాన్ పెట్టి నూనె వేడిచేసి ఆ పిండితో పునుగులు వేయాలి. ఎర్రగా కాగాక తీయాలి. ఇవి నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి

పాల ఉండ్రాళ్లు తయారీకి కావలసినవి

బియ్యప్పిండి - ఒక కప్పు 
నీళ్లు తగినన్ని 
చక్కెర - ఒక కప్పు 
కొబ్బరి తురుము - ఒక కప్పు
 పాలు - ఒక కప్పు 
నువ్వులు- అర కప్పు 
యాలకుల పొడి - పావు టీ స్పూన్

తయారీ విధానం: గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత అందులో బియ్యప్పిండి వేసి కలిపి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తరువాత స్టవ్​ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేయాలి. ఇప్పుడు మరో పాన్లో చక్కెర చేసి తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో కొబ్బరి తురుము వేసి కలపాలి. తరువాత అ పాకంలో బియ్యప్పిండితో చేసిన ఉండ్రాళ్లు వేసి పాలు పోసి 4 నిమిషాలు ఉడికించాలి. చివరిగా నువ్వులపొడి వేసి కలిపి దించాలి. పైనుంచి యాలకుల పొడి చల్లాలి

మోర్ కళీ తయారీకి కావలసినవి

బియ్యప్పిండి- రెండు కప్పులు 
పుల్లటి మజ్జిగ- ఒకటిన్నర కప్పు
 పచ్చిమిర్చి- 3
ఎండు మిర్చి-1 
జీలకర్ర - అరచెంచా
పసుపు-చిటికెడు 
ఉప్పు- సరిపడా
నూనె- అర కప్పు 
మినప్పప్పు- అర టీ స్పూన్ 
పెసర పప్పు-అర టీ స్పూన్
 కరివేపాకు- మూడు రెబ్బలు
 అవాలు -అర టీ స్పూన్

తయారీ విధానం:  బియ్యప్పిండిలో సరిపడా ఉప్పు చేసి మజ్జిగ పోసి ఇడ్లీ పిండిలా కలపాలి. ఇప్పుడు పాన్​ లో  నూనె వేడి చేసి మినప్పప్పు, శెనగపప్పు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు.. ఇంగువ వేసి వేగించాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేయాలి. అవసరాన్ని బట్టి మరికొంచెం మజ్జిగ పోసి కలిపి మూతపెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కాసేపటికి అది ఉప్మాలా పొడిపొడిగా తయారవుతుంది. వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

వెన్నముద్దలు తయారీకి కావలసినవి

బియ్యప్పిండి - కేజీ
బెల్లం- అరకేజి
వెన్న-రెండు వందల గ్రాములు
 నూనె- రెండు కప్పులు
యాలకులపొడి- మూడు టీస్పూన్లు

తయారీ విధానం: గిన్నెలో బియ్యప్పిండి, వెన్న వేసి కొద్దిగా నీళ్లుపోసి బాగా కలిపి ముద్ద చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేయాలి. ఇప్పుడు పాన్​ లో  నూనె వేడిచేసి ఉండల్ని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. అవి వేగుతున్నప్పుడే బెల్లం పాకం పట్టి యాలకుల పొడి వేసి వేగించిన వెన్న ఉండల్ని పాకంలో వేయాలి

–వెలుగు, లైఫ్​–