-
ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు..కోటి మందికి లబ్ధి
న్యూఢిల్లీ: స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా లాంటి ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్‌లో పని చేస్తున్న గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాళ్లకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ ఇన్సూరెన్స్ అందజేస్తామని ప్రకటించింది.
ఈ–శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసేకునే అవకాశం కల్పించి, ఐడీ కార్డులు అందజేస్తామని చెప్పింది. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ల సేవలను గుర్తించి, వాళ్లకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ–శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గిగ్ వర్కర్లకు అవకాశం కల్పిస్తాం.
ఐడీ కార్డులు అందజేస్తాం. వారికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తాం. మేం తీసుకున్న నిర్ణయంతో దాదాపు కోటి మందికి లబ్ధి చేకూరుతుంది” అని బడ్జెట్ స్పీచ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
కాగా, అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ–శ్రమ్ పోర్టల్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న కార్మికులకు ప్రత్యేక యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్)తో ఐడీ కార్డులు అందజేస్తూ.. వివిధ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నది.