కులగణన నేటి సామాజిక అవసరం

కులగణన  నేటి సామాజిక అవసరం

బ్రిటిష్ ప్రభుత్వం 1872 నుంచి 1931 వరకు హైదరాబాద్ రాష్ట్రం మినహా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కులాల వారీగా జనాభా లెక్కలను నమోదు చేసింది. నిజాం ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జిగా పనిచేసి, ప్రభుత్వ ప్రచురణ విభాగానికి డైరెక్టరుగా కొనసాగిన సయ్యద్ సిరాజ్ ఉల్ హస్సన్ అధికారికంగా హైదరాబాద్ రాష్ట్రంలోని 98 కులాల/తెగలకు సంబంధించి సమగ్రంగా సర్వే నిర్వహించి 1920లో ఆయా కులాల, తెగల ఆర్థిక, రాజకీయ, సామాజిక హోదాతోపాటు, గోత్రాలు, ఆచార సంప్రదాయాలను ప్రచురించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 2014లో  బీఆర్ఎస్  ప్రభుత్వం సకల కుటుంబ సర్వేతో కులాలవారీగా జనాభా లెక్కలు చేసి, ఆయా లెక్కలను గ్రామపంచాయతీలతో సహా అన్ని ప్రభుత్వ విభాగాల వద్ద ప్రజలకు అందుబాటులో పెట్టి చరిత్ర సృష్టిస్తామని ప్రగల్బాలు పలికింది. సమగ్ర కుటుంబ సర్వేలో సమాచారాన్ని సేకరించి అధికారికంగా ప్రకటించకుండా, వారి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు.  ఇలాంటి తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా కులగణన చేయడానికి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించాలి, 

బిహార్​ నమూనాగా జరగాలి

ఇటీవల బిహార్ రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల్లోని అడ్డంకులను అధిగమించి 1931 తర్వాత దేశంలోనే మొదటిసారిగా కులాల వారీగా జనాభా లెక్కలు చేసి అధికారికంగా ప్రకటించి చరిత్రను సృష్టించింది. బిహార్ రాష్ట్రంలో మొత్తం జనాభా 13.01 కోట్లు. ఇందులో ఉన్నత కులాల వారు 15.52%, మొత్తం వెనుకబడిన తరగతులు 63.14%. ఇందులో వెనుకబడిన కులాలు 27.12%, అత్యంత వెనుకబడిన కులాలు 36.01%, షెడ్యూల్ కులాలు 19.65%, షెడ్యూల్డ్ తెగలు 1.68%గా తేల్చింది. ప్రస్తుతం విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లను షెడ్యూల్డ్ కులాలకు15 నుంచి 20 శాతానికి, షెడ్యూల్డ్ తెగలకు 1 నుంచి 2 శాతానికి, ఇతర వెనుకబడిన తరగతులకు12 నుంచి18 శాతానికి, అత్యంత వెనుకబడిన తరగతులకు 18 నుంచి 25 శాతానికి పెంచి గతంలో 46%గా ఉన్న
 రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది. అదేవిధంగా 2019 నుంచి ఉన్నత కులాల్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు కూడా ఈ డబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మొత్తం రిజర్వేషన్లు 75%గా అమలు చేస్తున్నారు. బిహార్ ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపుతో పాటు కులాల వారీగా సామాజిక, ఆర్థిక, విద్య మొదలగు గణాంకాలు ఉన్నాయి కాబట్టి, ప్రత్యేకమైన పథకాలను ఆయా కులాల అవసరాన్ని బట్టి  అమలు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తుంది. అదే బాటలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొదలగు రాష్ట్రాలు కులగణన చేస్తున్నాయి.

తప్పనిసరి..

నేటి ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణ ద్వారా కుల వ్యవస్థను నిషేధించకుండా, కులాంతర వివాహాలను పూర్తిస్థాయిలో ప్రోత్సహించకుండా, కుల నిర్మూలన చేయకుండా ప్రజాస్వామ్యం ముసుగులో కుల స్వామ్యాన్ని నడుపుతున్నారు.  కావున, నేడు దేశంలో కులగణన సామాజిక అవసరంగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వమే  2021 నాటి జనాభా లెక్కల్లో కులగణన చెయ్యాలి.  దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నా, విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి మించి అమలు చేయాలంటే కులగణన తప్పనిసరి.

సామాజిక తెలంగాణ కావాలి

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కులగణనకు న్యాయస్థానాల్లో అడ్డంకులు రాకుండా పూర్తిస్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి శాస్త్రీయబద్ధంగా,  బిహార్ తదితర రాష్ట్రాలు పాటించిన సూత్రాలను పరిగణనలోకి తీసుకొని కులాల వారీగా జనాభా లెక్కలను సేకరించి అధికారికంగా ప్రకటించి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. అదేవిధంగా విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను 29 శాతం నుంచి 50 శాతానికి పెంచి సామాజిక తెలంగాణగా నిరూపిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా అధికార పార్టీగా నిలుస్తుంది.

- కోడెపాక
కుమార స్వామి,
సోషల్​ ఎనలిస్ట్