లోన్ తీసుకున్నోళ్లు కిస్తీలను సరిగా కడితే అటు బ్యాంకులకు, ఇటు కస్టమర్లకు లాభం. మరోసారి లోన్ తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా ఇబ్బంది ఉండదు. కస్టమర్లపై నమ్మకం కుదిరితే బ్యాంకులు మరింత మందికి రుణాలు ఇస్తాయి. తీసుకున్న డబ్బు తిరిగివ్వకుండా జనం ‘మొండి’గా ప్రవర్తిస్తే బ్యాంకులు లోన్లు ఇవ్వాలంటే జంకుతాయి. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయి. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి, కొంత మందికే లోన్ ఇచ్చి, తాము సేఫ్ సైడ్ ఉంటాయి. ‘ముద్ర’ పథకం బ్యాంకులను ఈ బాటే పట్టేలా చేస్తుందేమోననే డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే, ఈ పథకం కింద ఎన్‌పీఏల మొత్తం 16 వేల కోట్ల రూపాయలకు చేరింది.
చిన్న, మధ్య తరహా వ్యాపారులను మోడీ సర్కారు ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం ‘ముద్ర’. దీనిద్వారా రూ.10 లక్షల వరకు లోన్ ఇచ్చి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట ప్రారంభించిన ఈ ‘ముద్ర’ పథకం కింద అడిగినవాళ్లకు కాదనకుండా రుణాలు అందజేశారు. గత ఏడాదిలోనే (2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 వరకు) వివిధ బ్యాంకులు మొత్తం 3.11 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. అందులోని 97 శాతం వరకు లోన్ అకౌంట్లు రెగ్యులర్‌గా నడుస్తున్నాయి. అంటే లోన్ తీసుకున్నోళ్లు కిస్తీలను సక్రమంగానే చెల్లిస్తున్నారు. మిగతా మూడు శాతం ఖాతాలే ‘మొండి’గా తయారయ్యాయి.
97 శాతంతో పోల్చితే 3 శాతం చాలా తక్కువగానే కనిపించొచ్చు. కానీ.. మొండి బాకీలు తగ్గటానికి బదులు పెరుగుతున్న విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదు. ముద్ర స్కీం కింద ఓపెన్ చేసిన లోన్ అకౌంట్లలో నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ) 2017–18తో పోల్చితే 2018–19లో డబుల్ అయ్యాయి. ఇలా పెరిగిన మొండి ఖాతాల విలువే రూ.9,204.14 కోట్లు. 2018 మార్చి 31 నాటికి ఎన్పీఏలు రూ.7,277.31 కోట్లు ఉండగా 2019 మార్చి 31 నాటికి రూ.16,481.45 కోట్లకు చేరాయి.
గతేడాది మార్చి 31 వరకు ఉన్న పరిస్థితిని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ షుక్లా ఈ ఏడాది ఫిబ్రవరి 12న రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి సంబంధించిన ఎన్‌పీఏల వివరాలను ‘ముద్ర’ సంస్థ ఆర్టీఐ దరఖాస్తుదారుడికి అందజేసింది. ముద్ర స్కీంలో ఎన్పీఏలుగా ప్రకటించిన అకౌంట్ల సంఖ్య 2018 మార్చి 31 నాటికి 17.99 లక్షలు. అది 2019 మార్చి 31 నాటికి 30.57 లక్షలకు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే మొండి ఖాతాలు 12.58 లక్షలు పేరుకుపోయాయి.
ముందే హెచ్చరించిన ఆర్బీఐ
ఎన్పీఏలు పెరగటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర ఆర్థిక శాఖను ఈ ఏడాది జనవరి 13నే హెచ్చరించింది. అయినా మోడీ సర్కారు మొండి బాకీల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు ఏమీ చేసినట్లు లేదు. మొత్తం లోన్లలో 45 శాతం వరకు ఆడవాళ్లకు ఇవ్వగా ఎస్సీలకు 10.15 శాతం, ఎస్టీలకు కేవలం 3.3 శాతం మాత్రమే మంజూరు చేయటం గమనార్హం. ముద్ర యోజనలో మొత్తం 21 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రూ.2.74 లక్షల కోట్లు లోన్లు కింద ఇచ్చాయి.
అన్ని బ్యాంకుల కన్నా ఎస్బీఐ ఎక్కువ రుణాలు (రూ.83,621 కోట్లు) విడుదల చేసింది. ఎస్బీఐ తర్వాత కెనరా బ్యాంకు రూ.27,704 కోట్లు ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ,19,712 కోట్లతో మూడో ర్యాంక్ సాధించింది. ఇవన్నీ 2019, జనవరి 25 వరకు ఉన్న వివరాలు. ఇప్పటివరకు చర్చించిన ఎన్పీఏలు కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు సంబంధించినవే. ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, మైక్రోఫైనాన్స్ సంస్థల్లోని మొండి బాకీలను కూడా కలిపితే ఎన్‌పీఏల సంఖ్య ఇంకా పెరుగుతుంది.
ఖాతాదార్ల వివరాలు లేవట!
మొండి బాకీలకు సంబంధించిన వివరాలను చాలా వరకు వెల్లడించిన ముద్ర సంస్థ టాప్–100 ఎన్ఏపీ అకౌంట్ హోల్డర్ల పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ఆ డేటా తమ వద్ద లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరికి ఆర్బీఐ కూడా ఇదే విధంగా స్పందించటం చర్చనీయాంశంగా మారింది. ఖాతాదార్లు ఎవరు, వాళ్లు ఎంత లోన్ తీసుకున్నారు, ఏ మేరకు ఎగ్గొట్టారు, వడ్డీ రేటు ఎంత అనే సమాచారాన్ని బ్యాంకులు ‘ముద్ర’కి, ఆర్బీఐకి చెప్పకుండా ఉంటాయా? అని సామాన్యులు సైతం ముక్కు మీద వేలేసుకుంటున్నారు.
మందలించిన సుప్రీం కోర్టు
లోన్ ఇన్స్టాల్మెంట్లను ఉద్దేశపూర్వకంగా చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తుల వివరాలను ఆర్టీఐ కింద తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆర్బీఐని ఇటీవల మందలించింది. బ్యాంక్ యాన్యువల్ రిపోర్ట్లనూ బయటపెట్టాల్సిందేనని ఆదేశించింది. ఎన్ని బ్యాడ్ లోన్లను ‘రిటన్ ఆఫ్, చేశారో చెప్పాలని ఆర్టీఐ దరఖాస్తుదారుడు అడిగినా ‘ముద్ర’ నుంచి రెండో మాట రాలేదు. అసలు అలాంటి డేటాయే తమ వద్ద ఉండదంటూ ‘ముద్ర ’ ఏజెన్సీ పాడిన పాటే పాడింది.
ఈ లోన్లు మూడు రకాలు
ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై)ని ప్రధాని మోడీ 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. నాన్–కార్పొరేట్, నాన్–ఫార్మ్ స్మాల్/మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కి రూ.10 లక్షల వరకు లోన్ ఇవ్వటం ఈ పథకం లక్ష్యం. ఈ రుణాలను ముద్ర లోన్లు అంటారు. ‘ముద్ర’ ఫుల్‌ఫామ్.. ‘మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్,. ముద్ర లోన్లు మూడు రకాలు. ఒకటి.. శిశు. రెండు.. కిషోర్. మూడు.. తరుణ్. శిశు కేటగిరీలో రూ.50 వేల వరకు, కిషోర్ విభాగంలో రూ.50,001 నుంచి రూ.5 లక్షల లోపు, తరుణ్ కేటగిరీలో రూ.500001 నుంచి రూ.10 లక్షల లోపు రుణాలు అందిస్తారు. కమర్షియల్, రీజనల్ రూరల్, స్మాల్ ఫైనాన్స్, కోపరేటివ్ బ్యాంకులతోపాటు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ (ఎంఎఫ్ఐలు), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) ఈ లోన్లను మంజూరు చేస్తాయి.
– ‘ది వైర్, సౌజన్యంతో..