కోతలు లేకుండా కరెంట్ .. కామారెడ్డి జిల్లాలో కొత్తగా 52 ట్రాన్స్​ఫార్మర్ల బిగింపు

  • యాసంగికి విద్యుత్​ శాఖ ముందస్తు ప్లాన్​
  •  689 అగ్రికల్చర్​కనెక్షన్లు మంజూరు ​ 

కామారెడ్డి​, వెలుగు: ఎండకాలంలో ఎలాంటి పవర్​ కట్లు లేకుండా మెరుగ్గుగా కరెంట్ సప్లయ్​ చేసేందుకు ఎన్పీడీసీఎల్ ​అధికారులు ముందస్తు ప్లాన్​ రూపొందించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే ఇందుకు సంబంధించి పనులు ప్రారంభించారు. జిల్లాలో భూగర్భజలాల మీద ఆధారపడే ఎక్కువగా పంటల సాగు జరుగుతుంది. కాబట్టి యాసంగి సీజన్​లో కరెంట్​డిమాండ్​ ఎక్కువగా ఉంటుంది. ఎండకాలంలోకమర్షియల్​, డొమెస్టిక్​ కరెంట్​వినియోగం కూడా పెరుగుతుంది. దీంతో డిమాండ్​కు తగ్గట్టు సప్లై చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సబ్ స్టేషన్లలో పవర్​ ట్రాన్స్​ఫార్మర్ల మార్పు, కొత్త ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటు, లైన్ల మార్పు, కెపాసిటర్లు అమర్చటం వంటి పనులు చేపట్టారు. 

డిమాండ్​కు తగ్గట్టు... 

జిల్లాలో మొత్తం 4,36,354 విద్యుత్​కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 1.12, 247 అగ్రికల్చర్​ కనెక్షన్లు. ప్రస్తుతం రోజు 4.5 మిలియన్​ యూనిట్స్​ నుంచి 5 మిలియన్​ యూనిట్స్​ వరకు కరంటు డిమాండ్​ఉంది. బుధవారం జిల్లాలో 5 మిలియన్​ యూనిట్ల కరంటు వినియోగించారు. ఎండకాలంలో వినియోగం 6 నుంచి 6.5 మిలియన్​ యూనిట్స్​ వరకు పెరుగుతుంది. యాసంగిలో బోర్ల కిందనే దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. వరికి నీటి అవసరం ఉంటుంది కాబట్టి బోర్లు ఆగకుండా నడుస్తుంటాయి. దీంతో డిమాండ్​ పెరిగి తరచూ సరఫరాలో అంతరాయాలు వస్తుంటాయి. ఈ సమస్య రాకుండా ముందుగానే సప్లై సిస్టమ్​లో లోపాలు చక్కదిద్దుతున్నారు. సబ్​స్టేషన్ల వారీగా ట్రాన్స్​ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నారు. 

 లైన్ల మార్పు 

 జిల్లాలో 33/11 కేవీ సబ్​స్టేషన్లు 132 ఉన్నాయి. వీటి పరిధిలో వివిధ కెపాసిటీ కలిగిన 34,631 ట్రాన్స్​ఫార్మర్లు ఉన్నాయి. కరంటు వినియోగం పెరిగినప్పుడు ట్రాన్స్​ఫార్మర్లు, సబ్ స్టేషన్లలోని పవర్​ ట్రాన్స్​ఫార్మర్ల మీద లోడ్​పెరిగి సప్లయ్​లో అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్య తీర్చేందుకు కలెక్టరేట్​ దగ్గరున్న 33/11 కేవీ సబ్​స్టేషన్​లో, అన్నారం, ఎల్లంపేట సబ్​స్టేషన్లలో కొత్తగా పవర్​ ట్రాన్స్​ఫార్మర్లను బిగించారు. కామారెడ్డి టౌన్​లో లైన్ల మార్పిడి చేపట్టారు. కామారెడ్డి సబ్​ స్టేషన్​లో లోపాలు తలెత్తితే మరో చోటి నుంచి సప్లయ్​ జరిగేలా లైన్లు మార్చి, కెపాసిటర్లు బిగించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, లింగంపేటల్లో లైన్లు మార్చారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్​వాడలతోపాటు పలు గ్రామాల్లో కొత్తగా 52 డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్​ఫార్మర్లను బిగించారు. 

జిల్లాలో కామారెడ్డి టౌన్​, తాడ్వాయి మండలం చిట్యాల, బాన్సువాడ మండలం బోర్లంలలో కొత్తగా 33/11 సబ్​స్టేషన్లు శాంక్షన్​ అయ్యాయి. డిసెంబర్​లో జిల్లాలో కొత్తగా 689 అగ్రికల్చర్​ కనెక్షన్లు శాంక్షన్​చేశారు. మరో 1200 అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. ఎన్పీడీసీఎల్​ పరిధిలో అగ్రికల్చర్​ కనెక్షన్ల శాంక్షన్​లో కామారెడ్డి టాప్​లో ఉంది. కొత్త కనెక్షన్లకు తగ్గట్టు ట్రాన్స్​ఫార్మర్ల ఏర్పాటు చేస్తున్నారు.