లైన్ క్లియర్ యాప్.. ప్రమాదాలకు చెక్!

లైన్ క్లియర్ యాప్.. ప్రమాదాలకు చెక్!
  • రూపొందించిన ఎన్పీడీసీఎల్ సంస్థ
  • పోల్స్, ట్రాన్స్​ఫార్మర్లపై  ప్రమాదాల నివారణ
  • యాప్ పై లైన్ మెన్లు, ఆపరేటర్లకు అవగాహన
  • సబ్ స్టేషన్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం
  • హెల్మెట్, హ్యాండ్ గ్లవ్స్ పైనా సిబ్బందికి వార్నింగ్ 

నిర్మల్, వెలుగు:  కరెంటు సరఫరా కోసం చేపట్టే మరమ్మతుల సమయంలో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ఎన్పీడీసీఎల్ సంస్థ ప్రత్యేకంగా ఆన్ లైన్  లైన్ క్లియర్(ఎల్ సీ) యాప్ రూపొందించింది. దీని  వాడకంపై  ఏఈలకే కాకుండా లైన్ మెన్లు, అసి స్టెంట్ లైన్ మెన్లు, సబ్ స్టేషన్ల ఆపరేటర్లకు అవగాహన కల్పిస్తోంది. కొంతకాలం నుంచి ఎల్సీలు తీసుకొని కరెంటు పోల్స్ పైన, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద  పని చేసే సమయంలో సమాచార లోపం, మానవ తప్పిదాలతో ప్రమాదాలు జరుగుతుండగా సిబ్బంది తీవ్రంగా గాయపడడమే కాకుండా ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ఎన్పీడీసీఎల్ సంస్థ కొత్తగా ఆన్ లైన్ లైన్ క్లియర్ యాప్ ను తయారు చేసింది. దీని ద్వారా ఎల్ సీలు తీసుకున్న సమాచారంపై అధికారులకు వెంటనే తెలిసిపోతుంది. అలాగే సంబంధిత ఏఈ పర్మిషన్ లేకుండా తీసుకునే ఎల్సీ లను కూడా యాప్ ద్వారా నివారించవచ్చని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

సబ్ స్టేషన్ నుంచి లైన్ క్లియర్ అయ్యాకే..

 ఇకముందు విద్యుత్ సిబ్బంది లైన్ క్లియర్ యాప్ ను పకడ్బందీగా వాడుకోవాల్సి ఉంటుంది. కరెంట్ సప్లయ్ పనులకు ఎల్సీ తీసుకోవాలనుకునే  లైన్ మెన్  ముందుగా యాప్ ను ఓపెన్ చేయాల్సి ఉంది.  ఆ తర్వాత అందులో సంబంధిత ఫీడర్లలో ఎల్సీ కావాలని ఏఈకి తెలపాలి. దీంతో ఏఈ లైన్ మెన్ రిక్వెస్ట్ ను పరిశీలించి సంబంధిత ఫీడర్ల కు ఎల్సీ ఇవ్వవచ్చా.. లేదా  ఇవ్వలేని పరిస్థితి ఉందా.. వంటి అంశాలతో పాటు ఎమర్జెన్సీ  షెడ్యూలు పనులు ఉన్నాయా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఏఈ యాప్ ద్వారానే లైన్ క్లియర్ కు పర్మిషన్లు ఇస్తారు. ఇదే యాప్ ద్వారా సంబంధిత సబ్ స్టేషన్ ఆపరేటర్ కు కూడా లైన్ క్లియర్ కు సమాచారం వెళ్తుంది. 

సమాచారం అందగానే  సంబంధిత సబ్ స్టేషన్ ఆపరేటర్ లైన్ మెన్ కు పలు సూచనలు అందిస్తారు.  లైన్ మెన్ హెల్మెట్ పెట్టుకోవాలని, హ్యాండ్ గ్లౌజ్ లు వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వేయాలని,  ఏపీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా అనేవి యాప్ ద్వారా లైన్ మన్ కు చేరుతుంది. ఎప్పటికప్పుడు యాప్ అందరిని అలర్ట్ చేస్తుంది.  లైన్ మెన్ విద్యుత్ సరఫరా మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం సంబంధిత ఫొటో లు యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా ఎల్ సీ రిటర్న్ చేసేందుకు సంబంధిత ఆపరేటర్ల కు యాప్ ద్వారానే సమాచారం అందుతుంది. తద్వారా విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించే చాన్స్ ఉందని ఎన్పీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు.

ఎల్ సీదే కీరోల్  

 విద్యుత్ సరఫరాలో ఎల్ సీదే కీరోల్ అని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సిబ్బంది పోల్స్ పై కానీ సబ్ స్టేషన్ల పైన ట్రాన్స్ ఫార్మర్ల పైన మరమ్మతు పనులు చేసే సమయంలో ఎల్ సీ కీలకంగా ఉంటుంది.  దీన్నీ తీసుకునేందుకు సంబంధిత సిబ్బంది మొదట సబ్ స్టేషన్ ఏఈ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇతరుల కరెంటు సరఫరాకు ఎక్కువ సమయం ఆటంకం కలిగించకుండా నిర్ణీత సమయంలోనే ఎల్ సీ ఆధారంగా మరమ్మతు పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సరైన సమాచార వ్యవస్థ పకడ్బందీగా లేకపోవడంతో ఎల్ సీ విషయంలో మానవ తప్పిదాలకు ఆస్కారం ఏర్పడుతుంది. దీంతో ప్రమాదాలు సైతం పెరిగిపోతున్నా యి. ఈ నేపథ్యంలోనే ఎన్పీడీసీఎల్ సంస్థ పూర్తి టెక్నాలజీని వినియోగించుకుని రూపొందించిన ఆన్ లైన  లైన్ క్లియర్ యాప్ ప్రమాదాలను నివారించేందుకు దోహదపడనుంది.