మణిపూర్లో పరిస్థితి అల్లకల్లోలం.. బీజేపీ ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఎన్పీపీ

మణిపూర్లో పరిస్థితి అల్లకల్లోలం.. బీజేపీ ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఎన్పీపీ

ఇంఫాల్: మణిపూర్లో పరిస్థితులు మరోసారి అల్లకల్లోలంగా మారాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మ నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP) మణిపూర్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి తప్పుకుంది. మణిపూర్లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దడంలో, హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేయడంలో బిరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే మణిపూర్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. అయితే మణిపూర్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి ఎన్పీపీ వైదొలగడం వల్ల బిరేన్ సింగ్ సర్కార్కు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి సొంతంగానే మెజారిటీ ఉంది.

కాకపోతే.. ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం మాత్రం మణిపూర్లో రాజకీయంగా కీలక పరిణామమనే చెప్పాలి. మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మాత్రం ఆ రాష్ట్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిరిబమ్ జిల్లాలో రెండేళ్ల పిల్లాడి తల లేని మొండెం, ఆ పిల్లాడి నానమ్మ మృతదేహం జిరిబమ్ సమీపంలోని నదిలో కొట్టుకొచ్చాయి. అదే కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలడు, ఒక మహిళ కూడా అదృశ్యమయిన పరిస్థితి.

జిరిబామ్ జిల్లాలో ఇటీవల అదృశ్యమైన ఆరుగురిలో ముగ్గురు మహిళల డెడ్​బాడీలు శుక్రవారం రాత్రి మణిపూర్ – అస్సాం సరిహద్దులోని జిరి నది, బరాక్ నది సంగమం వద్ధ లభ్యమయ్యాయి. దీంతో మణిపూర్ రాజధాని ఇంఫాల్తో పాటు పలు జిల్లాల్లో నిరసనలు చెలరేగాయి. అధికారులు శనివారం సాయంత్రం 4:30 గంటల నుంచి  ఇంఫాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కర్ఫ్యూ విధించారు. జిరిబామ్ జిల్లాలోని బోకోబెరాలో కుకీ టెర్రరిస్టులుగా అనుమానిస్తున్న కొందరు ఈ నెల 11న (సోమవారం) భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో పది మంది దుండగులు మృతి చెందారు. వారంతా కుకీ టెర్రరిస్టులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, వారి ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోయారు. వారిని కుకీలే కిడ్నాప్ చేశారని పోలీసులు భావించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జిరి నది, బరాక్ నది సంగమం వద్ధ ఓ మహిళ, ఇద్దరు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి డెడ్ బాడీలను పోలీసులు పోస్టుమార్టం కోసం సిల్చార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు.

కాగా.. ఈ ఘటనకు సంబంధించిన విషయం తెలియగానే హత్యకు గురైన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంఫాల్​లో నిరసనలు చెలరేగాయి. ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇండ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో మణిపూర్ ప్రభుత్వం శనివారం ఇంఫాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కర్ఫ్యూ విధించింది. ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని హోం మంత్రిత్వ శాఖ భద్రతా బలగాలను ఆదేశించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మణిపూర్లో అశాంతి నెలకొని.. శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పడంతో మహారాష్ట్రలో ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని మరీ అమిత్ షా మణిపూర్ హింసాత్మక ఘటనలపై సమీక్ష నిర్వహించడం గమనార్హం.