- ఎన్‌పీఎస్ వాత్సల్యతో .. సాఫీగా పిల్లల రిటైర్‌మెంట్
- ఎన్‌పీఎస్ మాదిరే బెనిఫిట్స్
- షేర్లు, బాండ్లు, సెక్యూరిటీల్లో పరోక్షంగా ఇన్వెస్ట్ చేయొచ్చు
- బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, ఈ-ఎన్‌పీఎస్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకునే వీలు
న్యూఢిల్లీ: పిల్లల రిటైర్‌మెంట్ కోసం తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేయడానికి కొత్త స్కీమ్ ఎన్‌పీఎస్ వాత్సల్యను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బుధవారం లాంచ్ చేశారు. ఏడాదికి కనిష్టంగా రూ. వెయ్యి, గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఈ–ఎన్‌పీఎస్ ప్లాట్‌ఫామ్‌లో ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) ప్రజలకు మంచి రిటర్న్స్ ఇచ్చిందని సీతారామన్ అన్నారు. ఇప్పటికే ఉన్న ఎన్‌పీఎస్ స్కీమ్‌కు ఎన్‌పీఎస్ వాత్సల్య పొడిగింపని, ఇది పిల్లల కోసం తీసుకొచ్చిందని వెల్లడించారు.
గత పదేళ్లలో ఎన్‌పీఎస్ సబ్‌స్క్రయిబర్లు 1.86 కోట్లకు పెరిగారు. ఈ స్కీమ్ కింద ఉన్న అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) రూ.13 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది యూనియన్ బడ్జెట్‌లో ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తో కలిసి ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మరికొన్ని బ్యాంకులు ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్‌ను లాంచ్ చేశాయి.
ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్ అంటే..
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఈ స్కీమ్‌ను ఓపెన్ చేయొచ్చు. పిల్లల వయసు 18 ఏళ్ల దాటిన తర్వాత ఎన్‌పీఎస్ వాత్సల్య అకౌంట్ సాధారణ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా మారిపోతుంది.18 ఏళ్ల లోపు ఉన్నవారి కోసమే అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలుంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఇండియన్ సిటిజెన్స్ అయి ఉండాలి. పిల్లల వయసు 18 ఏళ్లు దాటిన తర్వాత ఎన్‌పీఎస్ వాత్సల్య అకౌంట్‌లోని అమౌంట్ రూ.2.5 లక్షల లోపు ఉంటే మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అమౌంట్ దాటితే 20 శాతం అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 80 శాతం అమౌంట్‌ను ఎన్‌పీఎస్‌లో యాన్యుటీ (మెచ్యూరిటీ అయ్యాక లంప్ సమ్ పొందొచ్చు) కొనుక్కోవడానికి వాడుకోవచ్చు. ఒకవేళ సబ్‌స్క్రయిబర్ చనిపోతే నామినీకి లేదా లీగల్ గార్డియన్‌కు మొత్తం అమౌంట్ వెళుతుంది.
పెట్టుబడి అవకాశాలు..
ఎన్‌పీఎస్ వాత్సల్యలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్లను షేర్లు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. అందువలన పెట్టుబడులపై ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రిటర్న్ పొందడానికి వీలుంటుంది. ఎన్‌పీఎస్ వాత్సల్య అకౌంట్‌ను ఓపెన్ చేసేటప్పుడు మూడు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
1. డిఫాల్ట్ చాయిస్..
మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ (ఎల్‌సీ–50): ఇన్వెస్ట్‌మెంట్‌లో 50 శాతాన్ని షేర్లలో పెడతారు.
2. ఆటో ఛాయిస్ (లైఫ్ సైకిల్ ఫండ్) ..
సబ్‌స్క్రయిబర్ ఏజ్‌ను బట్టి ఆటోమెటిక్‌గా అడ్జెస్ట్‌మెంట్స్ చేస్తారు. ఇందులో మూడు సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అగ్రెసివ్ కేటగిరీ (ఎల్‌సీ–75) లో 75 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ను షేర్లలో పెడతారు. మోడరేట్ (ఎల్‌సీ–50) లో 50 శాతం అమౌంట్‌ను, కన్జర్వేటివ్ (ఎల్‌సీ–25 ) లో 25 శాతం అమౌంట్‌ను షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు.
3. యాక్టివ్ ఛాయిస్..
తమ పెట్టుబడుల్లో ఏ అసెట్ క్లాస్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది పేరెంట్స్ నిర్ణయించుకోవచ్చు. పెట్టుబడుల్లో 75 శాతం వరకు షేర్లలో, 100 శాతం వరకు కార్పొరేట్ బాండ్లలో, 100 శాతం వరకు ప్రభుత్వ సెక్యూరిటీల్లో, 5 శాతం వరకు ఆల్టర్నేటివ్ అసెట్స్ (హెడ్జ్‌ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటివి) లో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.