
గుంటూరు : కష్టపడి సంపాదించిన సొమ్ములో రూపాయి దానం చేయాలంటేనే ఆలోచించే కాలమిది. అలాంటిది తన సంపాదనలో రూ.20 కోట్లు విరాళంగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు ఓ ఎన్నారై డాక్టర్. గుంటూరు జీజీహెచ్కు ఆ మొత్తాన్ని అందజేసి అందరి చేత శెభాష్ అనిపించుకున్నారు.
గుంటూరుకు చెందిన డాక్టర్ ఉమ గవిని జీజీహెచ్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1965లో మెడిసిన్ పూర్తి చేసిన ఆమె ఉన్నత చదువు పూర్తయ్యాక.. నాలుగు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె అమెరికా ఇమ్యూనాలజీ, ఎలర్జీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. గత నెలలో డల్లాస్లో జరిగిన గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమావేశానికి ఉమ హాజరయ్యారు. అప్పుడే హాస్పిటల్కు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
డాక్టర్ ఉమ భర్త డాక్టర్ కానూరి రామచంద్ర రావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ పూర్తి చేశారు. ఆయన సైతం యూఎస్లో ఎనస్థటిస్ట్గా సేవలందించారు. మూడేళ్ల క్రితం ఉమ భర్త చనిపోయారు. అయితే వారికి వారసులెవరూ లేకపోవడంతో ఇన్నాళ్లు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ఆమె గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కు రాసిచ్చారు. ఈ డబ్బును జీజీహెచ్లో నిర్మిస్తున్న మదర్ అండ్ చైల్డ్ కేర్ యూనిట్ నిర్మాణానికి ఉపయోగించాలని నిర్ణయించారు. భారీ విరాళం అందించడంతో ఎంసీసీయూకు ఉమ పేరు పెడతామని అధికారులు చెప్పగా ఆమె నిరాకరించారు. తన భర్త కానూరు రామచంద్రరావు పేరు పెట్టాలని చెప్పడంతో అధికారులు అందుకు అంగీకరించారు.