తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడినట్లే.. ఎన్ఆర్ఐలు కూడా మేము సైతం అంటూ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారు. అనేక సందర్భాల్లో స్వరాష్ట్ర ఏర్పాటుకు వారి మద్దతు తెలిపారు. ఉద్యమానికి అన్ని రకాలుగా అండగా నిలిచారు. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటి చెప్పారు. కానీ స్వరాష్ట్రంలోనూ ప్రజల బతుకులు మారడం లేదని ఇప్పుడు ఎన్ఆర్ఐలు బాధపడుతున్నారు. ఈ మధ్య నేను అమెరికా వెళ్లినపుడు అనేక మంది తెలంగాణ ప్రవాసీలను కలిశా. కొందరు ప్రముఖులతో మాట్లాడినపుడు తెలంగాణ పాలనపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరిచారు. అమెరికాలో ఉన్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) వంటి సంస్థల ప్రతినిధులు తెలంగాణ ఉద్యమంలో వారి పాత్రను, ప్రస్తుత తెలంగాణలో పాలన తీరును వారు ప్రస్తావించారు. 1998లో ప్రొ. జయశంకర్, ప్రొ. బి.జనార్ధన్‌రావు అమెరికా పర్యటనకు వెళ్లారు. బీజేపీ1997లో కాకినాడ తీర్మానం చేసి ఉన్న సమయం అది. కాంగ్రెస్40 మంది తెలంగాణ ప్రజాప్రతినిధులు జయశంకర్సార్నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వాదన వినిపించారు. ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి కేంద్రం ఆలోచిస్తున్న సమయమది. అప్పటికి టీఆర్ఎస్ పుట్టలేదు. ఆ సందర్భంలో ఆటా, తానా వంటి సంఘాలు తెలంగాణకు అనుకూలంగా లేవు. కాబట్టి తెలంగాణ అభివృద్ధికి, రాష్ట్ర సాధనకు తెలంగాణ ఎన్ఆర్ఐలు సంఘటతమై ఒక సంస్థను ప్రారంభించాలని జయశంకర్ సార్, జనార్ధనరావు సూచించారు. దాని ఆధారంగా1999లో టీడీఎఫ్ఏర్పాటైంది. ఈ మధ్యే టీడీఎఫ్20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రవాసీ తెలంగాణ దివస్ కూడా చేసుకున్నారు. నా అమెరికా పర్యటనలో టీడీఎఫ్ ప్రతినిధులు కొందరు నాతో మాట్లాడారు. ‘‘టీడీఎఫ్1999 నుంచి ఉద్యమంలో మమేకమై పోరాటం చేసింది. అటు జేఏసీలో భాగమై సాగరహారం, మిలియన్‌మార్చ్, సకల జనుల సమ్మె వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని చేయూతనిచ్చింది. ఉద్యమపార్టీ టీఆర్ఎస్కు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించింది. అటు అమెరికాలో ఇటు తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేశారు. 2008లో ఓయూలో ప్రవాసీ తెలంగాణ కార్యక్రమం నిర్వహించేందుకు అప్పటి వైఎస్ ప్రభుత్వం అనుమతించలేదు. పైగా ‘కేంద్రంలో రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉన్నది, మీ పాస్‌పోర్టులు రద్దు చేస్తాం”అని వైఎస్ బెదిరించారు. అయినా మేము వెనక్కి తగ్గలేదు. అమెరికాలో చలో డీసీ ఏర్పాటు చేసి ఇక్కడి ఉద్యమకారులను పిలిచి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి అంతర్జాతీయ పత్రికల్లో తెలంగాణ ఉద్యమ వార్త వచ్చే విధంగా చేశాం. 2004-–14 మధ్యలో సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, ప్రణబ్‌ముఖర్జీ అమెరికాకు వెళ్లిన సందర్భంలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను వారి ముందు ఉంచాం. శాంతియుత నిరసనలు తెలిపి ఉద్యమ ఆకాంక్షను తెలిపాం”అని ఎన్ఆర్ఐలు నాతో చెప్పారు.
త్వరలో ఎన్ఆర్ఐల మెగా ఈవెంట్
తెలంగాణలో నేటికీ రైతులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం, నిరుద్యోగ సమస్య పెరగడం, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారిగా లేకపోవడం చూస్తే .. వచ్చిన తెలంగాణ ఎవరి పాలైంది? అని ఆవేదన చెందుతున్నట్లు ఎన్ఆర్ఐలు నాతో మాట్లాడుతూ బాధపడ్డారు.‘‘ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులు అర్ధరాత్రి ధ్వంసం చేస్తారని మేము ఎన్నడూ ఊహించలేదు. 1968లో కౌలుదారు చట్టం అమలు కోసం తెలంగాణ ఉద్యమం వచ్చింది. దాన్ని అణచివేస్తే నక్సలిజం వచ్చింది. ఎంతో మంది అమాయక యువకులు చనిపోయారు. తెలంగాణ వచ్చాక భూముల సమస్య పరిష్కారం అయితదనుకున్నం. కానీ గతం కంటే ఎక్కువ భూ ఆక్రమణలు పెరిగి పోయాయి. ‘ధరణి’ పాలకులకు పాడి ఆవుగా మారింది. ఎస్సీల భూములు లాగేసుకోవడం, గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవడం. సమగ్ర భూ సర్వే చేస్తామని చేయకపోవడం, నేటికీ అనేక భూ సమస్యలతో రైతులు సతమతం కావడం బాధకలిగిస్తున్న విషయం. విచ్చలవిడి అవినీతి, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపడం ఏ తెలంగాణ ఉద్యమకారుడు ఊహించి ఉండడు. జీతాలు ఇవ్వలేని తెలంగాణ ప్రభుత్వాన్ని మనం కోరుకున్నామా’’ అని ఎన్ఆర్ఐలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్పాదక రంగాలపై దృష్టి లేదని, అందుకే తాము తెలంగాణ ఎన్ఆర్ఐ స్టడీ ఫోరం ఏర్పాటు చేసి నిజమైన ఉద్యమకారుల సహకారంతో 9 ఏండ్ల పాలనపై వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నామని ఎన్ఆర్ఐలు తెలిపారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షులు విశ్వేశ్వర్‌రెడ్డితో మాట్లాడినపుడు ‘‘తెలంగాణ రాష్ట్రం సాధన ఎంత ముఖ్యమో తెలంగాణ అభివృద్ధి అంతకన్నా ముఖ్యమైనది. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, అవినీతి మొదలైన అంశాలపై చర్చిస్తున్నాం”అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ‘‘కొద్ది రోజుల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఒక మెగా ఈవెంట్నిర్వహిస్తం. అమెరికాలోని వివిధ తెలంగాణ టెర్రిటోరియల్సంఘాలు, వివిధ దేశాల్లోని తెలంగాణ సంఘాలను ఆహ్వానిస్తాం. ఈ సమావేశాలకు తెలంగాణ అభివృద్ధే ఎజెండా. మాకు రాజకీయాలపై , అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లపై ఎలాంటి ఆసక్తి లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. దాదాపు వంద దేశాల్లో 20 లక్షల తెలంగాణ పౌరులున్నారు. అందుకే గ్లోబల్ విలేజ్ప్రోగ్రాంను, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణ స్టడీ ఫోరం ఇచ్చిన రిపోర్టును ఈ సమావేశంలో చర్చించి రాజకీయాలకు అతీతంగా ప్రజల ముందు ఉంచుతాం”అని ఆయన వెల్లడించారు.
తెలంగాణ కన్వెన్షన్‌ను అవమాన పరిచి..
తెలంగాణ అభివృద్ధిపై ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకు కూడా తమకు అపాయింట్మెంట్లేదంటున్నారు. ప్రశ్నించే వారు ఉండొద్దని అన్ని ఉద్యమ సంఘాలను బలహీనం చేశారు. బలప్రయోగంతో అణచివేసి నిరసనలకు కూడా తావులేకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘రాజ్యసభలో బిల్‌పాస్ కాగానే ప్రెస్‌మీట్‌పెట్టి ఉద్యమ సంఘాల పేరు కూడా కేసీఆర్ ఉచ్చరించలేదు. ఆ తర్వాత ఉద్యమకారుల అణచివేత ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని బయట పెట్టింది. తెలంగాణ ఎన్నడూ ప్యూడలిస్టులకు లొంగలేదు. ఓయూ హాస్టల్స్ లో భోజనాలు బంద్‌చేసి కేసులు పెడితే ఎన్ఆర్ఐలుగా మా వంతు సహకారం అందించి ఉద్యమాన్ని బలోపేతం చేశాం. అమెరికాలో ఆ రోజుల్లో ఏ తెలుగు సంఘం వారూ బతుకమ్మ ఆడేవారు కాదు. మేం బతుకమ్మ ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు ప్రారంభించామని గర్వంగా చెప్పుకుంటాం. తెలంగాణలో 2016 జూన్2, 3, 4 తేదీల్లో గ్లోబల్ తెలంగాణ కన్వెన్షన్ ఏర్పాటు చేశాం. కేసీఆర్రానంటే కేటీఆర్ ను అడిగాం. వస్తానని చెప్పి అమెరికా వచ్చారు. కానీ కార్యక్రమానికి రాకుండా ఆ కార్యక్రమాన్నే అవమాన పరిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజల కలలన్నీ నెరవేరుతాయని అనుకున్నం. కానీ వారి కలలు కల్లలై తెలంగాణ అప్పుల పాలైంది. స్వరాష్ట్రంలో ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నాం. మేం చదువుకున్న హాస్టల్స్‌కు నిధులు లేక పోవడం, మేం చదువుకున్న స్కూళ్లు మూత పడటం, మేం చదువుకున్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు అధ్యాపకుల నియామకం లేకపోవడం దురదృష్టకరం. మాకు బతుకుదెరువు చూపిన యూనివర్సిటీలు మూతపడి, ప్రైవేటు యూనివర్సిటీలు తెలంగాణ ద్రోహుల చేతిలో పురుడు పోసుకోవడం మేం భరించలేకపోతున్నాం. తెలంగాణ ప్రజలకు వైద్యం ఖరీదైపోయింది. సాగునీటి రంగంలో ప్రగతి లేదు. కట్టిన కాళేశ్వరం మొన్నటి వానలకు పనికిరాకుండా పోయింది. ప్రభుత్వం మిషన్ భగీరథ గురించి గొప్పలు చెప్పుకుంటున్నా.. ఇప్పటికీ ప్రజలు తాగునీటిని కొనుక్కొంటున్నారు”అని వాపోయారు.
నరహరి వేణుగోపాల్‌రెడ్డి, బీజేపీ నాయకులు