Sheikh Hasina: బంగ్లాదేశ్ వదిలేసి వచ్చిన షేక్ హసీనా విషయంలో భారత్ నిర్ణయం ఇదే..

Sheikh Hasina: బంగ్లాదేశ్ వదిలేసి వచ్చిన షేక్ హసీనా విషయంలో భారత్ నిర్ణయం ఇదే..

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా దేశం విడిచిపెట్టి భారత్ చేరుకున్న  బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, భారత మిలటరీ సీనియర్ అధికారులు భేటీ అయ్యారు. హిండన్ ఎయిర్ బేస్లో ఉన్న ఆమెకు రక్షణ కల్పించే విషయమై ఆమెతో మాట్లాడారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత నిఘా ఏజెన్సీ సంస్థలు ఆమెను హిండన్ ఎయిర్ బేస్ నుంచి మరింత సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిర్ణయించాయి. 

షేక్ హసీనా ఆశ్రయం కోరుతూ భారత్కు రావడంతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రధాని మోదీని కలిశారు. బంగ్లాదేశ్లో తాజా పరిస్థితులను ప్రధానికి ఆయన వివరించారు. అయితే.. షేక్ హసీనాను భారత ప్రధాని మోదీ కలిసి మాట్లాడతారో, లేదో ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. షేక్ హసీనా భారత్కు రావడంతో విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశాంగ మంత్రి జయశంకర్తో ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ నివాసంలో షేక్ హసీనా భద్రతకు సంబంధించి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్, అజిత్ దోవల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానితో పాటు ఉన్నారు.

ALSO READ | Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హెలికాఫ్టర్ ఎక్కడ ల్యాండ్ అయిందంటే..

బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపు తప్పడంతో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో మేఘాలయ నైట్ కర్ఫ్యూ విధించింది. యూకే నుంచి అనుమతి వచ్చాక భారత్ నుంచి షేక్ హసీనా అక్కడికి వెళ్లి తలదాచుకోనున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా  మారాయి. ఈ కోటాను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్తో విద్యార్థుల చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి ఇప్పటివరకూ 300 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన పరిస్థితులొచ్చాయి. బంగ్లాదేశ్లో పాలన పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది.