
న్యూఢిల్లీ: ఐపీఓకి రావడానికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) కు మరింత సమయం దొరికింది. కిందటేడాది సెప్టెంబర్‌లో సెబీ అనుమతులు పొందిన ఈ కంపెనీ ఇప్పటి వరకు ఐపీఓకి రాలేదు. అనుమతి పొందిన తర్వాత నిర్ధిష్టమైన సమయంలోపు మార్కెట్‌లో లిస్ట్ కాకపోతే మళ్లీ సెబీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఎన్‌ఎస్‌డీఎల్ ఐపీఓకి రావడానికి ఈ ఏడాది జులై 31 వరకు సెబీ సమయమిచ్చింది. గడువు పెంచాలని ఎన్‌ఎస్‌డీఎల్ కోరడంతో డెడ్‌లైన్‌ను పొడిగించింది. దీంతో ఐపీఓకి సిద్ధం కావడానికి, మార్కెట్ పరిస్థితులు మరింత అనుకూలంగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్ల ముందుకు రావడానికి ఎన్‌ఎస్‌డీఎల్‌కు వీలుంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఈ డిపాజిటరీ కంపెనీ ఐపీఓ పేపర్ల ప్రకారం, షేర్ హోల్డర్లు ఎన్‌ఎస్‌ఈ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కలిసి సుమారు 5.72 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద అమ్మనున్నాయి. కాగా, సెబీ రూల్స్ ప్రకారం డిపాజిటరీ కంపెనీల్లో ఏ సంస్థకు కూడా 15 శాతం కంటే ఎక్కువ వాటా ఉండకూడదు. ఐడీబీఐ బ్యాంక్‌కు 26.10 శాతం వాటా, ఎన్‌ఎస్‌ఈకి 24 శాతం వాటా
ఉంది.