హైదరాబాద్, వెలుగు: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకైనట్టు వస్తున్న ఆరోపణలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. పేపర్ లీక్ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. రాజస్థాన్‌లోని సవాయ్ మాధాపూర్‌లోగల ఓ సెంటర్‌లో హిందీ మీడియం విద్యార్థులకు పొరపాటున ఇంగ్లిష్‌లో ఉన్న క్వశ్చన్ పేపర్ ఇచ్చారని పేర్కొంది. ఆ పొరపాటును సరిదిద్దే లోపలే స్టూడెంట్స్ బలవంతంగా ఆ ప్రశ్నా పత్రాలను బయటకు తీసుకెళ్లారని, సాయంత్రం 4 గంటల సమయంలో అవే క్వశ్చన్ పేపర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయని వెల్లడించింది.
కానీ, అప్పటికే అన్ని సెంటర్లలో ఎగ్జామ్ స్టార్ట్ అయిందని, పరీక్ష రాస్తున్న స్టూడెంట్లకు క్వశ్చన్లు తెలిసే అవకాశమే లేదని పేర్కొంది. ఎగ్జామ్ ప్రారంభం అవడానికి ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేస్తారని, గేట్లు మూసేసిన తర్వాత ఒక్కరు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉండదని తెలిపింది. పేపర్ల పంపిణీలో దొర్లిన పొరపాటు వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఆ సెంటర్‌లో ఎగ్జామ్ రాసిన 120 మందికి ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది స్టూడెంట్స్ హాజరయ్యారు.