తిరుమల లడ్డూ తిని ఎవరూ చనిపోలేదు కదా : NTK పార్టీ అధినేత సంచలన కామెంట్స్

తిరుమల లడ్డూపై ఇంత వివాదం ఎందుకు చేస్తున్నారు.. దేశ వ్యాప్తంగా ఎందుకు రచ్చ చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తూనే.. సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు NTK పార్టీ అధినేత సీమాన్. చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదం తిని ఎవరూ చనిపోలేదు కదా.. కల్తీ జరిగి ఉంటే చర్యలు తీసుకోవచ్చు కదా కామెంట్స్ చేశారాయన.

దేశంలో చాలా సమస్యలు ఉన్నాయని.. జనం చాలా సమస్యలతో అల్లాడిపోతున్నారని.. ధరలు పెరిగే తినటానికి ఇబ్బంది పడుతున్నారని.. ఇలాంటి సమయంలో లడ్డూ, బూందీ అంటూ దేశవ్యాప్తంగా చర్చ ఎందుకు అని ప్రశ్నించారు సీమాన్. లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా.. కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా అని ప్రశ్నించారాయన. 

తిరుమల లడ్డూ అంశాన్ని కావాలనే వివాదం చేస్తున్నారని.. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠను దిగజార్చుతున్నారంటూ మండిపడ్డారాయన. కావాలనే ఈ అంశాన్ని వివాదం చేస్తున్నారని.. ఇతర సమస్యలను డైవర్ట్ చేయటానికే అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా జనం సమస్యలపై దృష్టి పెట్టాలంటూ హితవు పలికారు సీమాన్.