పవర్​మెక్​ ఎంప్లాయ్​కి ఎన్టీపీసీ క్యాంటీన్

  • అటు రూ.లక్షల్లో జీతం... ఇటు అదనపు ఆదాయం 
  • ఫుడ్​ క్వాలిటీ పాటించడం లేదంటున్న కార్మికులు 
  • భూనిర్వాసితుల గోడు పట్టించుకోని సింగరేణి సంస్థ 

మంచిర్యాల, వెలుగు: జైపూర్​లోని సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​ (ఎస్టీపీపీ)లో క్యాంటీన్​ నిర్వహణ అధ్వానంగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ప్లాంట్​ కోసం భూములు ఇచ్చి రోడ్డునపడ్డ నిర్వాసితులు తమకు ఉపాధి కల్పించాలని మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ రూల్స్​కు విరుద్ధంగా పవర్​మెక్​ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉత్తరాది ఉద్యోగికి క్యాంటీన్​ను కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అతడు ఓవైపు పవర్​మెక్​ ఐటీ విభాగంలో రూ.లక్షల జీతం తీసుకుంటూనే.. మరోవైపు క్యాంటీన్  నడుపుకుంటున్నాడు. ప్లాంట్​ను పర్యవేక్షించే ఔట్​సోర్సింగ్​ అధికారుల అండదండలతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు.  

భూనిర్వాసితులకు మొండిచేయి...

ఎస్టీపీపీ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్లాంట్​లో ఉద్యోగాలు కల్పిస్తామని సింగరేణి అధికారులు హామీ ఇచ్చారు. తీరా ఉత్తరాది కార్మికులతో నింపేసి మెజారిటీ భూనిర్వాసితులకు మొండిచేయి చూపారు. ప్లాంట్​లో సుమారు 1500 మంది కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయ్​ ఉంటే.. వీరిలో భూనిర్వాసితులు, లోకల్​ వర్కర్లు 300 మందే ఉన్నారు. ఇంకా చాలామంది ఉద్యోగం, ఉపాధి కల్పించాలని సింగరేణి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. భూనిర్వాసితులు సొసైటీలుగా ఏర్పడి సివిల్​ వర్క్స్​, కాంటీన్​ మెయింటనెన్స్​, ఇతర పనులు అప్పగించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. రూల్స్​ ప్రకారం క్యాంటీన్​కు టెండర్లు పిలిచి తక్కువ రేట్​ కోట్​ చేసిన సొసైటీలకు అప్పగించాలి. కానీ సింగరేణి యాజమాన్యం ప్లాంట్​ నిర్వహణ బాధ్యతలన్నీ ఉత్తరాదికి చెందిన ఔట్​సోర్సింగ్​ అధికారులకు అప్పగిండంతో వారు చెప్పిందే వేదం అన్నట్టు తయారైంది. దీంతో సింగరేణి అధికారులు ప్లాంట్​ వ్యవహారాలతో తమకు ఏమాత్రం 
సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.  

సబ్సిడీలు పొందుతూనే దోపిడీ... 

ఎస్టీపీపీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు తక్కువ రేట్లకే రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు యాజమాన్యం క్యాంటీన్​ను ఏర్పాటు చేసింది. దీనికి విశాలమైన బిల్డింగ్​ను కేటాయించడంతో పాటు వాటర్​, కరెంట్​ ఫ్రీగా సప్లై చేస్తోంది. గ్యాస్​, ఫర్నిచర్​ పవర్​మెక్​ కంపెనీ సమకూర్చింది. హౌస్​కీపింగ్​ కార్మికులనే క్యాంటీన్​లో నియమించింది. ఇలా సింగరేణి నుంచి రూ.లక్షల్లో సబ్సిడీలు పొందుతూ ఆహార పదార్థాలకు ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారని, క్వాలిటీ పాటించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. క్వాంటీన్​లో పరిశుభ్రత లోపించిందని అంటున్నారు. ఇటీవల ఓ కార్మికుడికి బజ్జీల్లో వెంట్రుకలు రావడంతో అధికారులకు కంప్లైంట్​ చేసినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపాడు.