
- రామగుండంలో ఎన్టీపీసీ ప్లాంట్విస్తరణకు సభ నిర్వహణ
- భారీగా పోలీసుల మోహరింపు
- ప్రజలు రాకపోవడంతో ఖాళీగా కుర్చీలు
గోదావరిఖని, వెలుగు : తెలంగాణలోని ఎన్టీపీసీ ప్లాంట్విస్తరణకు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కట్టుదిట్టమైన భద్రత నడుమ కొనసాగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ జడ్పీ హైస్కూల్ ఆవరణలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో వేదిక వద్దకు ఎక్కువ మంది రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి.
మీడియా ప్రతినిధులను కూడా అడ్డుకోగా నిరసన తెలపడంతో అనంతరం కొద్ది సేపటికి అనుమతి ఇచ్చారు. కాగా ప్రజాభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపు నిచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వస్తుండగా ట్రాఫిక్పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల ప్లాంట్ఏర్పాటు అంశాన్ని ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం---– 2014లో పేర్కొన్నారు. ఇప్పటికే 1,600 మెగావాట్ల ఫేజ్–-1 ప్లాంట్ను నెలకొల్పి విద్యుత్ఉత్పత్తి ప్రారంభించారు. మిగిలిన 2,400 మెగావాట్ల ఫేజ్–2 ప్లాంట్ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు చేపట్టారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ, పీసీబీ ఈఈ భిక్షపతి, ఆర్డీవో గంగయ్య, ఎన్టీపీసీ ప్లాంట్ సీజీఎం చందన్ కుమార్ సమంత, హెచ్ఆర్ హెడ్ సిక్దర్, ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.
రామగుండాన్ని దత్తత తీసుకోవాలి– ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండంలో ఎన్టీపీసీ ప్లాంట్విస్తరణకు వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్సర్కార్హయాంలో పవర్పర్చేజ్అగ్రిమెంట్ (పీపీఏ) చేసుకుని 1,600 మెగావాట్ల ప్లాంట్ ను మాత్రమే నిర్మించిందని విమర్శించారు. మిగిలిన 2,400 మెగావాట్ల ఫేజ్–-2 ప్లాంట్ కోసం పీపీఏ చేయకపోవడంతో..
దీనిపై సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కేంద్రంతో ఒప్పించేలా చేశానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి 17 గ్రామాల ప్రజలు భూములు, ప్రాణాలు, ఆస్తులను త్యాగం చేసినా వారి పట్ల ఎన్టీపీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఎన్టీపీసీలో కాంట్రాక్టు పనులతో పాటు కాంట్రాక్టు జాబ్ లు కూడా స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.