
జ్యోతినగర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీకి స్వర్ణ శక్తి, రాజభాషా అవార్డు, తెలంగాణ థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ కు స్వర్ణ శక్తి అవార్డులు లభించాయి. కర్ణాటకలోని రాయ్ చూర్ లో జరిగిన ఐపీఎస్ – 2025 సమ్మిట్ లో గురువారం ఎన్టీపీసీ సీఎండీ గురుదీపు సింగ్ నుంచి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ హెచ్ వోడీ చంద్రకుమార్ సామంత అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా రామగుండం చంద్ర కుమార్ మాట్లాడుతూ.. రామగుండం ఎన్టీపీసీ, తెలంగాణ ప్రాజెక్ట్ టీమ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. హిందీ భాష ప్రచారంలో రామగుండం ప్రాజెక్ట్ లో ప్రతిభ కనబరిచిన రాజభాష అధికారి ఆదేశ్ కుమార్ పాండే ను ప్రశంసించారు. ఈ అవార్డును ఎన్టీపీసీ రామగుండం గెలుచుకోవడం గర్వకారణంగా ఉందన్నారు.
రామగుండంలో అధికారిక భాషగా హిందీని విజయవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ బీసీ సభ్యుడు బాబర్ సలీం పాష,హెచ్ ఆర్ హెడ్ బిజోయ్ కుమార్ సిక్దర్, రాజభాష అధికారి ఆదేశ్కుమార్ పాండే తదితరులు పాల్గొన్నారు.