- రూ. 15 వేల కోట్లు సేకరించాలని ప్లాన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ ఎన్‌టీపీసీ తన సబ్సిడిరీ కంపెనీలను మార్కెట్‌లో లిస్టింగ్ చేయడం ద్వారా రూ. 15 వేల కోట్లను సేకరించాలని చూస్తోంది. ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ, నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ కంపెనీలను మార్కెట్‌లో లిస్టింగ్ చేయనుంది. రూ. 15 వేల కోట్ల టార్గెట్‌ను చేరుకోవడానికి ఈ కంపెనీల లిస్టింగ్‌తో పాటు ఎన్‌టీపీసీ–సెయిల్ పవర్ కంపెనీ (ఎన్‌ఎస్‌పీసీఎల్) లో వాటాలను విక్రయించాలని ప్లాన్స్ వేసుకుంది. ఎన్‌ఎస్‌పీసీఎల్ ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. సెయిల్‌కు పవర్ సప్లయ్ చేయడానికి ఈ కంపెనీని 1999 లో ఏర్పాటు చేశారు. ఎన్‌టీపీసీ సబ్సిడిరీ కంపెనీలను 2024 లోపు మార్కెట్‌లో లిస్టింగ్ చేయాలని చూస్తున్నారు. ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చే అక్టోబర్‌లో లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కంపెనీ ఎన్‌టీపీసీకి ఫుల్లీ ఓన్డ్ సబ్సిడిరీ. ప్రస్తుతం ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ చేతిలో 3,450 మెగావాట్ల కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. 820 మెగా వాట్ల ప్రాజెక్టులు కన్‌స్ట్రక్షన్‌లో ఉండగా, మిగిలిన 2,630 మెగా వాట్ల విలువైన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కింద నిర్మిస్తారు. ఈ కంపెనీ 2032 నాటికి 60 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ కెపాసిటీని చేరుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఎన్‌టీపీసీ నార్త్ ఈస్ట్రన్ పవర్ కార్పొరేషన్, విద్యుత్ వ్యాపార్ నిగమ్ కంపెనీలు కూడా ఎన్‌టీపీసీకి ఫుల్లీ ఓన్డ్ సబ్సిడిరీ కంపెనీలు.