ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్‌.. ‌ రెండో యూనిట్​లో ఉత్పత్తి షురూ

  • ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్‌.. ‌  రెండో యూనిట్​లో ఉత్పత్తి షురూ
  • నిర్మాణానికి రూ.10,599  కోట్లు  కేటాయించిన కేంద్ర ప్రభుత్వం  
  •  ఉత్పత్తయ్యే విద్యుత్‌‌లో 90 శాతం తెలంగాణకే..

గోదావరిఖని/జ్యోతినగర్‌‌, వెలుగు  :  రామగుండంలోని ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌‌లో 800 మెగావాట్ల రెండవ యూనిట్‌‌లో బుధవారం నుంచి కరెంట్‌‌ ఉత్పత్తి(సింక్రోనైజేషన్‌‌)  మొదలైంది. మొదటి 800 మెగావాట్ల యూనిట్‌‌లో ఈ ఏడాది మార్చి 24వ తేదీన విద్యుత్‌‌ ఉత్పత్తి ప్రారంభించారు. తెలంగాణ పునర్విభజన చట్టంలో భాగంగా మొత్తం 4,000 మెగావాట్ల ప్లాంట్‌‌ను నెలకొల్పనుండగా మొదటి దశలో 1,600 మెగావాట్ల ప్లాంట్‌‌ పూర్తయి విద్యుత్‌‌ ఉత్పత్తి దశలోకి వచ్చింది. ఈ ప్లాంట్‌‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.10,599 కోట్లు కేటాయించింది. ఇందులో 90 శాతం విద్యుత్‌‌ను తెలంగాణ రాష్ట్రానికే కేటాయించనున్నారు. 

గ్రిడ్‌‌తో అనుసంధానం...

ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్‌‌లోని రెండో 800 మెగావాట్ల యూనిట్‌‌ను బుధవారం మధ్యాహ్నం 11 గంటల 49 నిమిషాలకు గ్రిడ్‌‌తో అనుసంధానాన్ని చేసి విజయవంతంగా పూర్తి చేశారు. ప్లాంట్‌‌లో జరిగిన కార్యక్రమంలో సీజీఎం కేదార్‌‌ రంజన్‌‌ పాండు, జీఎంలు కమలాకర్‌‌ దేశాయ్‌‌, అనుపమ్‌‌ ముఖర్జీ, మోహన్‌‌ రెడ్డి, సంతోష్‌‌ తివారీ, అర్పన్‌‌ తదితరులు హాజరై ఈ మైలు రాయిని సాధించిన తెలంగాణ ప్లాంట్‌‌ జీఎం దాస్‌‌ గుప్తా, సీనియర్‌‌ ఆఫీసర్లు, ఇతర బృందాన్ని అభినందించారు. ప్లాంట్‌‌కు సంబంధించిన బ్యాలెన్స్‌‌ వర్క్‌‌ను పూర్తి చేయాలని సీజీఎం ఆఫీసర్లకు సూచించారు. 

  2016లో మోడీ శంకుస్థాపన

రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌‌కు సమీపంలోనే తెలంగాణ సూపర్‌‌ థర్మల్‌‌ పవర్‌‌ ప్రాజెక్ట్‌‌ (టీఎస్‌‌టిపీపీ) నిర్మాణం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌‌ రీ‒ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌ ‒ 2014లో పేర్కొన్న విధంగా  మొత్తం 4,000 మెగావాట్ల ప్లాంట్‌‌ను నిర్మించేందుకు ఒప్పందం జరిగింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం  రూ.10,599 కోట్లు సమకూర్చింది. ఈ ప్రాజెక్ట్‌‌కు 2015 జనవరి 19న అగ్రిమెంట్‌‌ కాగా 2016 జనవరి 20న పర్యావరణ అనుమతి లభించింది. అదే ఏడాది 29వ తేదీన జీరో డేట్‌‌గా నిర్ణయించి నిర్మాణ పనులు ప్రారంభించారు. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. 

ఏటా 68.50 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సంస్థ అందించనుండగా, రోజుకు 20 వేల టన్నుల బొగ్గు సప్లై కానుంది. అలాగే రెండు టీఎంసీల నీళ్లను ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌ ద్వారా రిజర్వాయర్‌లో నింపనున్నారు. ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్‌‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌‌లో 90 శాతం తెలంగాణ రాష్ట్రానికే కేటాయించనున్నారు. సింగరేణి సంస్థ బొగ్గు సప్లై చేయడంతో ఉత్పత్తి వ్యయం తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్‌‌ ఒక యూనిట్‌‌ రూ.5 కే లభించనున్నది.