ఎన్టీపీసీ నిర్లక్ష్యంతోనే బూడిద పైపు​లైన్ పగిలింది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఎన్టీపీసీ నిర్లక్ష్యంతోనే బూడిద పైపు​లైన్ పగిలింది : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • బాధితులకు సత్వర సేవలు అందించడంలో మేనేజ్​మెంట్ ఫెయిల్: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గోదావరిఖని/జ్యోతినగర్, వెలుగు: రామగుండం అక్బర్ నగర్​లో బుధవారం రాత్రి బూడిద పైపులైన్ పగిలి చుట్టు పక్కల ఇండ్లల్లోకి బూడిద నీరు చేరిన ఘటన పూర్తిగా ఎన్టీపీసీ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. గురువారం రాత్రి ఆయన అక్బర్ నగర్​లో బూడిద నీటి పైపులైన్ పగిలిన ప్రాంతాన్ని, బూడిద నీరు చేరి డ్యామేజ్ అయిన ఇండ్లను పరిశీలించారు. బాధితులను కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ పైపులైన్ పగిలి బూడిద నీరు సమీప ఇండ్లల్లోకి చేరితే ఎన్టీపీసీ అధికారులు బాధిత కుటుంబాలకు సత్వర సహాయం అందించడంలో ఫెయిల్ అయ్యారని ఎంపీ మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని, డ్యామేజ్​ అయిన ఇండ్లను తిరిగి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దేశానికి వెలుగులు అందించడానికి అవసరమైన భూములను ఎన్టీపీసీకి అప్పగించిన నిర్వాసితులను మాత్రం ఆ సంస్థ చీకట్లో ఉంచుతున్నదని, ఇది సరైంది కాదని ఫైర్ అయ్యారు. బూడిద పైపులైన్ పగిలిన ఘటనపై ఎంక్వైరీ చేసి, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ వంశీకృష్ణ.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్​కు గురువారం లేఖ రాశారు. ఎన్టీపీసీ అధికారుల ఫెయిల్యూర్​ వల్లే ఇది జరిగిందని.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని, తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కేంద్ర మంత్రిని కోరారు.