దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి రామకృష్ట, బాలకృష్ణ, మనవళ్లు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించారు. తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. . వారితో పాటు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు.
ఎన్టీఆర్ కు మరణం లేదు : బాలకృష్ణ
తెలుగువారి దమ్ము, ధైర్యం ఎన్టీఆర్ అని చెప్పారు బాలకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వలనే రాజకీయ చైతన్యం వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేసి ఎన్టీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఅర్ నడచిన మార్గం స్పూర్తి దాయకయని, ఆయన చూపిన మార్గంలో టీడీపీ కార్యకర్తలు నడవాలని సూచించారు.
ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ధైవంగా ఉండిపోతారు : లక్ష్మీపార్వతి
మహాత్మా గాంధీ, అంబేద్కర్ మాదిరి ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ ధైవంగా ఉండిపోతారని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ చల్లని దీవెనలు తెలుగు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని తెలిపారు. ఎన్టీఆర్ స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్న ఆమె.. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి జగన్ ఎన్టీఆర్ గౌరవాన్ని కాపాడారన్నారు. ఎన్టీఆర్ అంటే జగన్ కు ఎంతో గౌరవమని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పనిచేయాలని వెల్లడించారు.