యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యింది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఇవాళ (సెప్టెంబర్ 22) జరగనున్న ఈ వేడుకకు వేలాదిగా తరలివచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఒక్కసారిగా ఆడిటోరియం లోపలికి దూసుకెళ్లారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధాటికి నోవాటెల్ హోటల్ లోపల అద్దాలు ధ్వంసం అయ్యాయి. 20 వేల మందికి పైగా అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో సెక్యూరిటీ చేతులేత్తేసింది. ఎన్టీఆర్ అభిమానుల మధ్య తోపులాట జరిగింది. లోపలికి పంపించాలని పోలీసులతో తారక్ ఫ్యాన్స్ వాగ్వాదానికి దిగారు.
ALSO READ | దేవర రిలీజ్ ట్రైలర్... భయం అంటే ఏంటో తెలియాలంటే... దేవర కథ వినాలి?
నోవాటెల్ హోటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్వల్ప లాఠీ ఛార్జ్ చేసి ఫాన్స్‌ను చెదరగొట్టారు. పరిమితికి మించి అభిమానులు రావడం, హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేవర మూవీ యూనిట్ ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు హోటల్ నుండి బయటకు పంపిస్తున్నారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం దేవర. అందాల తార శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మూవీ యూనిట్ ఇవాళ ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేశారు. అయితే, పరిమితికి మించి ఫ్యాన్స్ రావడంతో ప్రీ రిలీజ్ వేడుక రద్దు అయ్యింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, అనిరుథ్ వంటి భారీ తారాగణంతో ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన దేవర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.