వెలుగు, సిటీ నెట్వర్క్: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి ఉత్సవాలను మంగళవారం గ్రేటర్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఘాట్వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ , పురందేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని కొనియాడారు.
జనంలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలనే నేటి పాలకులు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేస్తామని తెలిపారు. వీరితోపాటు నివాళులర్పించిన వారిలో ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్రావు, కాట్రగడ్డ ప్రసూన, బక్కని నరసింహులు తదితరులు ఉన్నారు.
అలాగే ఫిలింనగర్ కల్చరల్సెంటర్లో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి నిర్వహించారు. కమిటీ చైర్మన్ టి.డి.జనార్దన్, ఎన్టీఆర్ వ్యక్తిగత డాక్టర్ సోమరాజు, డా.బి.ఎన్. ప్రసాద్, డా.డీఎన్ కుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ వ్యక్తిగత సహాయకులను సన్మానించారు. ఫిలింనగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాళులర్పించారు.
భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్టీఆర్ జయంతి నిర్వహించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేశారు. అనువాద ఫౌండేషన్ చైర్మన్ బిక్కీ కృష్ణ, నిర్మాత నందమూరి మోహన్ కృష్ణ, జస్టిస్ చంద్రకుమార్, పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, జనార్దన్, నరసింహప్ప పాల్గొన్నారు. సికింద్రాబాద్ టీడీపీ ఇన్చార్జ్శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమం నిర్వహించారు.